అభ్యర్థులవద్దకే శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం
సౌరశక్తి ఆధారిత మోబైల్ ట్రైనింగ్ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
Trinethram News : రాజమహేంద్రవరం: ఏడాదికి 50 వేలమందికి స్కిల్ డెవలప్మెంటులో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్.ఎస్.డి.సి) ఆధ్వర్యంలో రూపొందించిన సౌరశక్తి ఆధారిత మోబైల్ ట్రైనింగ్ వాహనాన్ని మోరంపూడి సెంటర్ సమీపంలో అమరావతి సాఫ్ట్ వేర్ ఇన్నోవేషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అమరావతి సాఫ్ట్ వేర్ ఇన్నోవేషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ అధినేత అనిల్, టీడీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
దక్షిణ భారతదేశంలో కేంద్రం కేటాయించిన ఒకే ఒక్క వాహనాన్ని తొలిసారిగా రాజమండ్రిలో ప్రారంభించినట్లు తెలిపారు. దీనిలో స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించిన 12 అంశాలు ఉంటాయని, యువత ఆసక్తిని బట్టి వారికి ఆ అంశాలను వివరిస్తారని ఆయన చెప్పారు. ఈ మొబైల్ వాహనం యువత వద్దకే వెళ్ళి వారికి ఆసక్తి కలిగిన అంశంపై శిక్షణ ఇస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. యువత తాము ఎంచుకున్న రంగంలో అభివృద్ధి చెందడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. గత ఏడాది తన పుట్టినరోజు నాడు ఆడంబరాలకు వెళ్ళకుండా తమ భవానీ చారిటబుల్ ట్రస్టు, అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించామని ఆయన గుర్తు చేశారు. ఒక కోర్సు నేర్చు కోవడానికి మూడు నాలుగు నెలలు పడుతుందని సుమారు రూ.40 వేలు, 50 వేలు ఖర్చవుతుందని, కాని వారికి రూపాయి ఖర్చు లేకుండా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు.
ఉద్యోగాలు కల్పించాలని అడిగే యువతకు నూరు శాతం ఉద్యోగాలు ఇచ్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారి డిఎస్సీ అభ్యర్థులకు తన సొంత ఖర్చుతో మాక్ టెస్టులు నిర్వహిస్తున్నామని, ఇప్పటికీ రెండు ఆదివారాలు మాక్ టెస్టులు జరిగాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. ఇది తెలుసుకున్న యువ మంత్రి నారా లోకేష్ తనను అభినందించారని ఆయన చెప్పారు. శ్రీకాకుళంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు డిఎస్సీ అభ్యర్థులకు మాక్ టెస్టులు నిర్వహిస్తున్నారని, మరి కొందరు ఎమ్మెల్యేలు ముందుకు వచ్చి డిఎస్సీకి హాజరవుతున్న అభ్యర్థులకు మాక్ టెస్టులు నిర్వహిస్తామని చెబుతున్నారని ఇది మంచి పరిణామమని, వారందరికీ తాను ఇన్స్పిరేషన్ గా ఉండడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


