ఆ మహనీయుడి అడుగుజాడల్లో పయనించాలి .
దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 22, త్రినేత్రం న్యూస్. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ కొనియాడారు. హైదరాబాద్ గుర్రంగూడ లో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ఆ మహనీయుడి అడుగుజాడల్లో పయనించాలని పిలుపునిచ్చారు. యావత్ భారతదేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సేవాలాల్ మహారాజ్ అంటూ అభివర్ణించారు.
కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కారు గిరిజనుల ఆరాధ్యదైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికారంగా నిర్వహించిందని గుర్తు చేశారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేసిందన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి గిరిజనులకు రాజ్యాధికారంలో కీలక భాగస్వామ్యం చేసిన ఘనత కేసీఆర్ దేనని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌లో బంజారాహిల్స్‌గా పిలుచుకుంటున్న ప్రాంతంలో మూడు శతాబ్దాల క్రితమే సేవాలాల్ మహారాజ్ నడయాడారని, అదే బంజారాహిల్స్ నేలమీద వారి పేరుతో నిర్మించిన భవన్‌లో బీఆర్ఎస్ సర్కార్ అధికారికంగా నిర్వహించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే అణగారిన వర్గాల అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు దక్కుతుందనడానికి వారి జయంతి ఉత్సవాల నిర్వహణ మరో ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు.
అడవి బిడ్డల ప్రత్యేకమైన ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక దృక్పథం, సామాజిక సాంసృతిక జీవన విధానాన్ని కాపాడటానికి సేవాలాల్ మహారాజ్ చేసిన కృషి గొప్పదని వెల్లడించారు. తన ప్రజలను బయటి సమాజం నుంచి అనుక్షణం రక్షించుకొనే దిశగా సంత్ సేవాలాల్ జీవితాంతం పోరాటం సాగించారని పేర్కొన్నారు. ఆ దిశగా వారు కల్పించిన చైతన్యం, వారు చేపట్టిన కార్యాచరణ దేశవ్యాప్తంగా ఉన్న లంబాడా/బంజారాలకు రక్షణ కవచంగా నిలిచిందని వివరించారు.
బంజారాలకు స్ఫూర్తి ప్రదాతగా నాటి కాలంలో వారు చేసిన కృషి, విశ్వవ్యాప్తంగా ఉన్న బంజారాలకు వారిని ఆధ్యాత్మిక గురువుగా, తమ ఆరాధ్య దైవంలా కొలిచేలా చేసిందని గుర్తుచేశారు. గిరిజన బిడ్డల ఆత్మగౌరవం పరిఢవిల్లేలా వారి ప్రతిభను చాటేందుకు, ఉద్యోగ, ఉపాధి, విద్య, క్రీడలు తదితర రంగాల్లో బీఆర్ఎస్ సర్కారు అనేక కార్యక్రమాలను నిర్వహించిందని చెప్పారు.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున, అత్యంత ఖరీదైన ప్రాంతంలో సంత్ సేవాలాల్ మహారాజ్ పేరుతోనే బంజారా భవన్‌ను వారి ఆత్మగౌరవం ఉట్టిపడేలా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. ఇందులో సంత్ సేవాలాల్ విగ్రహ ప్రతిష్ఠాపన చేసిందన్నారు. గిరిజనులంతా ఐకమత్యంతో మెలిగి పార్టీలకు అతీతంగా కృషి, పట్టుదలతో పరస్పర సమన్వయంతో పనిచేసి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు గిరిజన సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


