MLA Adireddy Srinivas : ప్రజలకు నచ్చిన సమయంలో రేషన్ బియ్యం తీసుకోవచ్చు

TRINETHRAM NEWS

ఎండీయూ వాహనాల రేషన్ అక్రమాలకు ఇక చెక్

వైసీపీ రైస్ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకే రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ

రేషన్ దుకాణాలపై అధికారుల‌ నిఘా ఉంటుంది

వికలాంగులకు… 65 ఏళ్ళు దాటిన వారికి ఇంటికే బియ్యం

సన్నబియ్యం ఇస్తానన్న సన్నాసి ఇవ్వలేదు

కూటమి అలాంటి హామీలు ఇవ్వదు

ఎండీయూ ఆపరేటర్లపై సీఎం, డిప్యూటీ సీఎం నిర్ణయం

రేషన్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమహేంద్రవరం : ప్రజలకు అనుకూలమైన సమయంలో రేషన్ బియ్యం తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 29,760 రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ( వాసు) చెప్పారు. సోమవారం సిటీలోని రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. తోలుత 11వ వార్డులో తోట కిరణ్ రేషన్ దుకాణంలో‌ ప్రజలకు కూటమి నాయకులు మజ్జి రాంబాబు, కురగంటి సతీష్, జామి సత్యనారాయణ,
ఆర్డీవో కృష్ణ నాయక్, అర్బన్ తహశీల్దార్ లతో కలిసి బియ్యం పంపిణీ ప్రారంభించి అనంతరం ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వికలాంగులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రేషన్ అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ గతంలో ఎండియూ వాసనాల ద్వారా ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ పేరుతో వైసీపీ నాయకులు రైస్ మాఫియాకు తెరలేపారని దానికి అడ్డుకట్ట వేసేందుకే ప్రజల కోరిక మేరకు‌కూటమి ప్రభుత్వం రేషన్ దుకాణాలు తిరిగి పునరుద్ధరించి ప్రతినెలా ఒకటి నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయిస్తున్నట్లు చెప్పారు.

ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ దుకాణాల్లో రేషన్ బియ్యం ఇస్తారని ఆయన తెలిపారు. ప్రజలు తమకు అనువైన వేళల్లో వెళ్ళి తెచ్చుకోవచ్చని, గతంలో మాదిరి ఎండియూ వాహనం ఎప్పుడు వస్తుందా అని పనులు మానుకుని ఇళ్ళవద్ద వేచి ఉండనవసరం లేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. అప్పుడు ఎండియూ వాహనం వచ్చినా సర్వర్ పని చేయడం లేదని రేషన్ ఇవ్వకుండా వెళ్ళి పోయేవారని ఆయన ఆరోపించారు. ఎండీయూ వాహనాల పేరుతో వైసీపీ రైస్ మాఫియా బియ్యం పక్కదారి పట్టించి కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ఆ రైస్ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజల కోరిక ప్రకారం మళ్ళీ రేషన్ దుకాణాల్లో రేషన్ పంపిణీ చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు. 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, వికలాంగులకు 5వ తేదీలోగా ఇంటికి వెళ్ళి రేషన్ అందచేస్తారని అన్నారు. వైసీపీ వారిలా హామీలు ఇవ్వబోమని, గతంలో సన్నబియ్యం ఇస్తానన్న సన్నాసి ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు.

ఇప్పుడు రేషన్ దుకాణాల్లో సర్వర్ పని చేయకపోయినా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా వారి ఫోటో తీసుకుని రేషన్ ఇచ్చి పంపిస్తారని తర్వాత దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తారని ఆయన చెప్పారు. రేషన్ దుకాణాల్లో అక్రమాలు జరగకుండా ఆర్డీవో, ఎమ్మార్వో స్థాయి అధికారుల నిఘా ఉంటుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎవరి పొట్ట కొట్టదని, ఎండీయూ ఆపరేటర్ల వినతిని ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పరిశీలించి ఏ నిర్ణయం తీసుకోవాలో ఆలోచిస్తారని ఆయన అన్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా మళ్ళీ రేషన్ దుకాణాలు పునరుద్ధరించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన 1వ వార్డు లాలా చెరువు రేషన్ షాపు నెం.69, 46వ వార్డు రామదాసు పేట 62 నెం.రేషన్ డిపో, 36వ వార్డు తుమ్మలావ 24వ నెం.షాపు, 13వ వార్డు అంబేద్కర్ నగర్ షాప్ నెం.90 లను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రేషన్ దుకాణాలను ప్రారంభించి రేషన్ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో 11వ డివిజన్ ఇంచార్జ్ కంటిపూడి రాజేంద్రప్రసాద్, రేషన్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ వి రామారావు, జిల్లా అధ్యక్షులు జామి కృష్ణ, గౌరవ అధ్యక్షులు బత్తిన నారాయణ రావు, రాజమహేంద్రవరం అర్బన్ అధ్యక్షులు నమ్మి వెంకటేశ్వరావు, కార్యదర్శి కె రమేష్, కోశాధికారి కె ఆదిరాజు, జాయింట్ సెక్రటరీ పుల్లూరి శ్రీను, చల్లా వెంకటేష్, రెవెన్యూ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

People can take ration

You cannot copy content of this page

Scroll to Top