Increase in Buses : గిరిజన ప్రాంతాల్లో బస్సులు పెంపు – అరకు బస్ స్టేషన్ ఆధునికీకరణకు విజ్ఞప్తి

TRINETHRAM NEWS
Increase in buses in tribal areas

Increase in Buses : అరకులోయ మార్చి 25, (త్రినేత్రంన్యూస్) : గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు తగిన రవాణా సదుపాయాలు కల్పించడంతో పాటు అరకు బస్ స్టేషన్‌ను ఆధునికీకరించాలని ఏపీఎస్ఆర్టీసీ నూతన మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బాలసుబ్రమణ్యంను విజయనగరం జోన్ చైర్మన్ డాక్టర్ సియ్యారి దొన్ను దొర కోరారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎండీ బాలసుబ్రమణ్యంను విజయవాడలోని ఏపీఎస్ఆర్టీసీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విజయనగరం జోన్ పరిధిలో సంస్థ అభివృద్ధికి సంబంధించిన సమస్యలను వివరించారు.
ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో బస్ సర్వీసులు తక్కువగా ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మెరుగుపడినప్పటికీ, వాటికి అనుగుణంగా బస్సుల సంఖ్య పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకు నియోజకవర్గ కేంద్రంలోని బస్ స్టేషన్‌ను ఆధునికీకరించాల్సిన అవసరాన్ని వివరించారు. ఇందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేసి పనులను వేగవంతం చేయాలని కోరారు. మహిళల కోసం అమలు చేస్తున్న ‘శ్రీ శక్తి’ పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినా, గిరిజన ప్రాంతాల్లో తగినన్ని బస్సులు లేకపోవడంతో మహిళలు ఆ ప్రయోజనాన్ని పూర్తిగా పొందలేకపోతున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో అవసరమైన బస్సుల వివరాలు, రహదారి పరిస్థితులతో కూడిన నివేదికను ఎండీకి సమర్పించారు. ప్రభుత్వంతో చర్చించి తక్షణమే అవసరమైన సంఖ్యలో బస్సులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎండీ ఎన్. బాలసుబ్రమణ్యం సమస్యలను సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top