Stay Away from Drugs : మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి…జీవితాన్ని కాపాడుకోండి

TRINETHRAM NEWS
Stay away from drugs…save life

విద్యార్థులకు జగద్గిరిగుట్ట సీఐ వెంకటేష్ సూచనలు

Stay Away from Drugs : కూకట్పల్లి మార్చి 25 (త్రినేత్రం న్యూస్) : మత్తు పదార్థాల బారిన పడితే భవిష్యత్తు నాశనం అవుతుందని, చిన్ననాటి నుంచే వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ విద్యార్థులకు సూచించారు. స్థానిక రాజీవ్ గృహకల్పలోని సంస్కృతి పాఠశాలలో జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ వెంకటేష్ మాట్లాడుతూ, తెలియని వయసులో కొందరు మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “దీపం కాలుతుందని తెలిసి ఎవరూ తాకరు… అదే విధంగా మత్తు పదార్థాల జోలికి కూడా పోకూడదు” అని విద్యార్థులకు స్పష్టంగా సూచించారు.
సమాజంలో నకిలీ వస్తువులు ఎలా అందుబాటులో ఉన్నాయో, అదే విధంగా మత్తు పదార్థాలు కూడా సులభంగా లభిస్తున్నాయని తెలిపారు. అయితే వాటిని అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
యువత మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బాలికలు ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. తెలిసినవారైనా, తెలియని వారైనా అనుచితంగా ప్రవర్తిస్తే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు. బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
సోషల్ మీడియా ప్రభావానికి లోనుకాకుండా, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పిన మార్గంలో సత్ప్రవర్తనతో ముందుకు సాగాలని సీఐ వెంకటేష్ విద్యార్థులకు హితవు పలికారు. సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించి, ఎవరైనా ప్రమాదంలో ఉంటే వారికి సహాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు, కానిస్టేబుళ్లు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top