
Tribal Families : అనంతగిరి మార్చి 25, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం చిలకల గెడ్డ పంచాయతీ పరిధిలోని మెట్టపాలెం గ్రామంలో గిరిజనుల ఆవేదన వ్యక్తమవుతోంది. గ్రామంలో సుమారు 35 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ, జీవనోపాధికి అవసరమైన ప్రాథమిక సదుపాయాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గతంలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా ప్రతి కుటుంబానికి బోటు, వలలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ అమలు విషయంలో నిర్లక్ష్యం నెలకొన్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు గ్రామానికి ఒక్క బోటు మాత్రమే అందించడంతో మిగతా కుటుంబాలు నిరాశకు గురయ్యాయి.
నదిలో చేపల వేటే ప్రధాన జీవనాధారంగా ఉన్న ఈ గిరిజనులు, సరైన బోటులు, వలలు లేక ఉపాధి కోల్పోతున్నామని వాపోతున్నారు. జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సంబంధిత జిల్లా అధికారులు, ప్రాజెక్ట్ అధికారులు వెంటనే స్పందించి, ఇచ్చిన హామీ మేరకు ప్రతి కుటుంబానికి బోటులు, వలలు అందజేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

