
Comprehensive Development : డుంబ్రిగుడ,ఆగస్టు 10, (త్రినేత్రం న్యూస్): ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి వనరుల పరిరక్షణతోనే ఆదివాసీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఎంపీటీసీ వంతల దేవదాసు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లూరి సీతారామరాజు జిల్లా, డుంబ్రిగుడ మండలం కిల్లోగూడ గ్రామంలో సాగరమౌళి, దింసా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీల ఆధ్వర్యంలో, సంజీవిని సంస్థ వ్యవస్థాపకులు పచారి దేవుళ్ల అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వంతల దేవదాసు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఆదివాసీ సమాజం తరతరాలుగా అడవులు, భూమి, జల వనరులతో పాటు ప్రకృతిని పరిరక్షిస్తూ తమ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తోందన్నారు. ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించడంతో పాటు విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులు, ఆర్థిక అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధిలో గ్రామసభలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని, ఆదివాసీల భూమి హక్కులను కాపాడాలని, అటవీ హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఆదివాసీ కుటుంబానికి చేరేలా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఆదివాసీ యువత విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు. మహిళల ఆర్థిక సాధికారతకు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రకృతి వైద్యం అందిస్తున్న గిరిజన మహిళలకు నిర్వాహకుల ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు. “ఆదివాసీ హక్కుల పరిరక్షణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ ప్రకృతి సంరక్షణ” అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని వంతల దేవదాసు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ ప్రతినిధి ప్రకాష్, ఏరువాక కేంద్రం డాక్టర్ ఉమామహేష్, సంజీవిని సంస్థ వ్యవస్థాపకులు పచారి దేవుళ్లు, ప్రజాప్రతినిధులు కొర్ర సీతారాం, కొర్రయి మాజీ సర్పంచ్ కొములు, ఆదివాసీ మహిళలు, సాగరమౌళి ఎఫ్‌పీఓ, దింసా ఎఫ్‌పీఓ ప్రతినిధులు పండన్న, రాంచందర్, గ్రామస్థులు, అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe