హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలి..
మాజీ ఎంపీ జివి హర్షకుమార్ డిమాండ్
Trinethram News : రాజమహేంద్రవరం : రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దారుణంగా ప్రవర్తిస్తున్నారని మాజీ ఎంపీ జివి హర్షకుమార్ మండిపడ్డారు. తెనాలిలో రెండ్రోజుల వ్యవధిలో జరిగిన రెండు సంఘటనలకు పోలీసులే బాధ్యత వహించాలని, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యాసంస్థల కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెనాలిలో ఇద్దరు యువకులను దారుణంగా కొట్టి వేధించడానికి కారకులైన ఎస్పీని, ఇద్దరు సిఐలను వెంటనే విధుల నుంచి డిస్మిస్ చేయాలని,
ఈ ఘటనతో పాటు ఒక పోలీసులు తీవ్రంగా వేధించిన ఘటనలో ఆత్మహత్య చేసుకున్న మహారాష్ట్రకు చెందిన బంగారం వ్యాపారి సిద్దేష్ జైన్ వ్యవహారంపై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేసారు. దళిత, మైనార్టీలకు చెందిన వారిని ఇష్టమొచ్చినట్టుగా కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. వారిపై ఇంతవరకు ఎటువంటి కేసులు లేకుండా రౌడీషీట్ ఉన్నట్టుగా కోర్టుకి ఇచ్చిన నివేదికలో పేర్కొనడం దారుణమని వ్యాఖ్యానించారు. రెండ్రోజుల్లో తెనాలి ఘటనపై చర్యలు తీసుకోకపోతే ఛలో తెనాలికి పిలుపునిస్తామని, అక్కడికి వెళ్లి అన్ని విషయాలను తేల్చుకుంటామని స్పష్టం చేసారు. ఆ యువకులతో పోలీసులే గంజాయి వ్యాపారం చేయిస్తున్నారని, వారిపై పెట్టే కేసులు, వేధింపులు భరించలేక వ్యాపారం చేయలేమని చెప్పడంతో దారుణంగా నడిరోడ్డుపై కొట్టుకుంటూ తీసుకుని వెళ్లారని ఆరోపించారు. పోలీసుల వద్ద చంపబడిన సిద్ధేష్ జైన్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వ్యవహారంపై కూడా ఆయన ధ్వజమెత్తారు. మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు లౌకిక వాదం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వక్ఫ్ బిల్లుకు మద్ధతిచ్చి మైనార్టీలను అణిచివేయడానికి సహకరించిన ఆయన ఆ పదవిలో ఉండేందుకు అర్హత లేదన్నారు. తిరుపతి లడ్డూ ఘటనపై సిట్ వేసి ఏం సాధించారని నిలదీసారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోతే కనీసం కేసు కూడా నమోదు చేయలేదన్నారు. పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై కూడా చంద్రబాబు చాలా దారుణంగా మాట్లాడుతున్నారని, సహజ మరణం పొందినట్టుగా వ్యంగంగా మాట్లాడటం సరికాదన్నారు. దీనిపై ఆయన వెంటనే క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఈనెల 4వ తేదీన హైకోర్టులో ఈ కేసులో వాదనలు వినిపిస్తామన్నారు. ఆయనకు దమ్ముంటే తమ బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేసారు. పవన్ కళ్యాణ్‌కు సనాతన ధర్మం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను గ్రామ బహిష్కరణ చేస్తే స్పందించిన పాపాన పోలేదని విమర్శించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


