జూలై 11, 2026
TRINETHRAM NEWS
Pachipenta Santhakumari

Pachipenta Santhakumari : అరకులోయ జూలై 4, (త్రినేత్రం న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, ముఖ్యంగా జీవో నెం.3కు చట్టబద్ధత కల్పించి గిరిజన నిరుద్యోగ ఉపాధ్యాయుల హక్కులను పరిరక్షించాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి డిమాండ్ చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ నిబంధనలు, 1/70 భూబదలాయింపు నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ గిరిజన ప్రాంతాల్లో హైడ్రో పవర్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, ఖనిజ తవ్వకాలు చేపట్టడం గిరిజనుల భూములు, అడవులు, జీవన హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు.
గిరిజనుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా చేపడుతున్న హైడ్రో పవర్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని, 1/70 చట్టానికి విరుద్ధంగా జరుగుతున్న ఖనిజ తవ్వకాలను పూర్తిగా రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రకటించిన హామీ మేరకు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వాలంటీర్ల నియామకాన్ని వెంటనే చేపట్టాలని, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్–1లోనే కొనసాగించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్లను ఆమె వెల్లడిస్తూ, జీవో నెం.3కు చట్టబద్ధత కల్పించడం, గిరిజనులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయడం, ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో హైడ్రో పవర్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను నిలిపివేయడం, 1/70 చట్టానికి విరుద్ధంగా జరుగుతున్న ఖనిజ తవ్వకాలను రద్దు చేయడం, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వాలంటీర్లను నియమించడం, అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్–1లోనే కొనసాగించడం వంటి అంశాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
గిరిజనుల హక్కులు, భూములు, అడవులు, రాజ్యాంగ పరిరక్షణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని, గిరిజనుల న్యాయమైన హక్కుల సాధన కోసం చివరి వరకు పోరాటం కొనసాగిస్తామని పాచిపెంట శాంతకుమారి హెచ్చరించారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ సభ్యుడు పాచిపెంట చిన్నస్వామి, యూత్ కాంగ్రెస్ నాయకులు మజ్జి అర్జున్, పాల్, చిట్టం నాయక్, బాల బదర్, కోర్ర సింహాద్రి, జన్నీ చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page