Employment Denial Act : ఉపాధి హామీ కాదు – ఉపాధి నిరాకరణ చట్టం

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా అరకులోయ, డిసెంబర్ 21,( త్రినేత్రంన్యూస్): 2005లో ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం కొత్త సవరణ బిల్లును తీసుకువచ్చిందని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ ఆరోపించారు. ఉపాధి హామీ చట్టం రద్దయితే ఆదివాసీలు, గ్రామీణ ఉపాధి కూలీలు తీవ్రంగా నష్టపోతారని ఆయన హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల ఉపాధ్యక్షులు కిల్లో జగనాధం ఆధ్వర్యంలో అరకువేలి మండలం శరభగుడ గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్ట సవరణ బిల్లు చట్టంగా మారితే ‘హామీ’ అనే పదాన్నే తొలగించడం ద్వారా చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.
పనిదినాలు 125 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం, వాస్తవానికి 60 రోజుల పని నిషేధం విధించడం దారుణమన్నారు. ఫిబ్రవరి 20 నుంచి జూన్ 20 వరకు ఉపాధి హామీ పనులు 75 శాతం పైగా జరుగుతాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని, ఈ కాలంలో వ్యవసాయ పనులు పెద్దగా ఉండవని తెలిపారు. అలాంటి సమయంలో 60 రోజుల పని కుదింపుకు ఏమి కారణమని ప్రశ్నించారు.
రైతులకు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో, పెట్టుబడి సాయం అందించడంలో విఫలమైన మోడీ ప్రభుత్వం రైతుల సమస్యలకు ఉపాధి హామీ పనులనే కారణంగా చూపించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల ద్వారా కాఫీ తోటల అభివృద్ధికి, పీఎం జన్మన్ హౌసింగ్ పథకం నిర్మాణానికి పనిదినాలు కల్పిస్తున్నారని, పొడుభూమి పట్టా ఉన్నవారికి 150 రోజుల పాటు పని కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఉపాధి హామీ చట్ట అమలుకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం నిధులు ఇస్తుండగా, కొత్త బిల్లులో రాష్ట్రాలు 40 శాతం వాటా ఇవ్వాలని పేర్కొనడం దారుణమని అన్నారు. పనులను నాలుగు రకాలుగా విభజించి యంత్రాలు, కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేలా ఉపాధి హామీని మార్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. గత బిల్లులో రాష్ట్రాల్లో కేంద్రం నిర్ణయించిన వేతనాలకన్నా ఎక్కువ వేతనాలు ఉంటే అవే కనీస వేతనాలుగా పరిగణించాలని నిబంధన ఉండేదని, తాజా బిల్లులో ఆ నిబంధనను రద్దు చేశారని తెలిపారు. అలాగే ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెంచాలనే నిబంధనను కూడా తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉపాధి హామీ కార్మికులు, ఆదివాసీలతో కలిసి పోరాటాలను ఉధృతం చేస్తామని పొద్దు బాలదేవ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల ఉపాధ్యక్షులు టి. హరి, సహదేవ్, ప్రసాద్, గోపి, రాము, బిదేసి, నిల్లో, పరశురాం, నీలాంబర్, దొన్ను మహేష్, మోహన్, చంప, కొండమ్మ, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Not a guarantee of employment

You cannot copy content of this page

Scroll to Top