ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Manyam Bandh

Manyam Bandh : అరకులోయ, ఆగస్టు 7,(త్రినేత్రంన్యూస్): రాష్ట్ర ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్టుల కోసం జారీ చేసిన జీవోలు 13, 51, 29, 2లను వెంటనే రద్దు చేయాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఆదివాసులకు 100 శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ నియామక రిజర్వేషన్ కల్పించేలా జీఓ నంబర్–3కు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయాలని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 8న నిర్వహించే రాష్ట్ర మన్యం బంద్‌లో ఆదివాసి ప్రజానీకమంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం లోతేరు పంచాయతీలో కే. స్వామి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బాలదేవ్ మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదివాసులకు 100 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా అమలు చేయకుండా హైపవర్ కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఆగస్టు 9న జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా 100 శాతం రిజర్వేషన్‌కు సంబంధించిన ఆర్డినెన్స్‌ను జారీ చేసి, ఆరు నెలల్లో చట్టబద్ధం చేయాలని కోరారు.
హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో నవయుగ, అదానీ, షిరిడి సాయి ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్స్ వంటి మెగా కంపెనీలతో ప్రభుత్వం ఏకపక్షంగా ఒప్పందాలు చేసుకుందని, వాటికి సంబంధించిన జీవోలు 13, 51, 29, 2లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల పేరుతో ఆదివాసులను నిర్వాసితులుగా మార్చే చర్యలను విరమించుకోవాలని, ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ సర్వేలు, డ్రోన్ల వినియోగంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివాసి ఉద్యమకారులపై అక్రమ కేసులు నమోదు చేసి వేధించడం, పోలీసు నిర్బంధాలకు పాల్పడడం తగదని అన్నారు.
1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో భూమి హక్కుల కోసం గిరిజనేతరులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఆదివాసుల హక్కులను నిర్వీర్యం చేసే కుట్రలో భాగమని ఆరోపించారు. 1/70 చట్ట పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వెంటనే కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్–1లో కొనసాగిస్తూ గెజిట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమావేశంలో అరకులోయ మండల పెసా ఫోరం నాయకులు ఎం. రమేష్, కే. రామన్న, కే. స్వామి, బలరాం, భీమా, మోహన్, నరసింగరావు, ఆదివాసి గిరిజన సంఘం నాయకులు రమేష్, గెన్ను రామ్‌చందర్, బాబూరావు, మంగలయ్య, లోతేరు పంచాయతీ నాయకులు కిలో నోబో, శెట్టి మధు, చందోర్, సోనాపతి రాజు, జగన్నాథం తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో ఆదివాసులు, మహిళలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page