ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్, జూన్ 19: పాడేరు ఐటిడిఏ పరిధిలో పీఎం జన్ మన్ హౌసింగ్ పథకంలో మంజూరైన ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన రూ.21 కోట్ల బకాయి బిల్లులు తక్షణమే విడుదల చేయాలంటూ, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు జూన్ 27న పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట భారీగా ధర్నా నిర్వహించనున్నట్లు, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ తెలిపారు.
మంగళవారం అరకువేలిలోని గిరిజన సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొద్దు బల్దేవ్ మాట్లాడుతూ “భారత ప్రభుత్వం 2023లో ప్రారంభించిన పీఎం జన్ మన్ హౌసింగ్ పథకం ద్వారా పాడేరు జిల్లాలోని అత్యంత వెనుకబడిన పీవీటీజీ తెగలకు ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. అయితే ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన మొత్తం రూ.3.39 లక్షలు తీరలేదు. పెరుగుతున్న నిర్మాణ వ్యయాల కారణంగా పీవీటీజీ కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి. ఇప్పటికీ రూ.21 కోట్లు బకాయిలుగా ఉన్నా ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈ పరిస్థితుల్లో వర్షాలు, చలిని తట్టుకోలేక లబ్ధిదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇతర వివరాల్లోకి వెళ్తే –
పాడేరు ఐటీడీఏ పరిధిలోని వివిధ మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు విడుదల చేయాల్సిన బకాయిలు ఇలా ఉన్నాయి:
అనంతగిరి: 616 మందికి ₹89 లక్షలు
అరకువేలి: 1989 మందికి ₹1.69 కోట్లు
డుంబ్రిగుడ: 849 మందికి ₹70 లక్షలు
హుకుంపేట: 1211 మందికి ₹1.59 కోట్లు
మంచింగిపుట్టు: 3137 మందికి ₹4.57 కోట్లు
పెదబయలు: 2180 మందికి ₹3.06 కోట్లు
పాడేరు: 1503 మందికి ₹1.94 కోట్లు
జి. మాడుగుల: 2572 మందికి ₹2.51 కోట్లు
చింతపల్లి: 2478 మందికి ₹1.86 కోట్లు
జి.కె. వీధి: 1744 మందికి ₹2.63 కోట్లు
కొయ్యూరు: 476 మందికి ₹50 లక్షలు
ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీవీటీజీ తెగల ప్రాథమిక అవసరాలైన ఇళ్లు, త్రాగునీరు, రోడ్డు, విద్యుత్, వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆయన విమర్శించారు. వేలాది గ్రామాలకు కనీస రహదారి సౌకర్యం లేకపోవడం, వైద్యానికి ఇప్పటికీ డోలిమోతలే ఆధారంగా ఉండటం దుర్ఘటన అని అన్నారు.
ఈ ధర్నాను విజయవంతం చేయడానికి పీఎం జన్ మన్ హౌసింగ్ లబ్ధిదారులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం మండల కార్యదర్శి జి. బుజ్జిబాబు, మండల నాయకులు జగన్నాధం, రామన్న, వెంకట్, బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

PM Janman Housing dues

You cannot copy content of this page