గిరిజన హక్కుల పరిరక్షణే మా లక్ష్యం – చిట్టం మురళి.
అల్లూరిజిల్లా(అరకువేలి) త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 25: అరకులోయ ఉషోదయ రిసార్ట్‌లో జనసేన పార్టీ సెంట్రల్ టీమ్ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అరకు నియోజకవర్గ ఇంచార్జీ చెట్టి చిరంజీవి అధ్యక్షతన, అనంతగిరి మండలం జనసేన అధ్యక్షుడు చిట్టం మురళి కీలక ప్రసంగం చేశారు.
చిట్టం మురళి మాట్లాడుతూ, గత పదేళ్ల కాలంలో గిరిజన సమస్యలపై జనసేన పార్టీ నిరంతరంగా పోరాటం చేస్తూ, రోడ్డు కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో కూడా పర్యటించి ప్రజల బాధలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అలాగే, గత ప్రభుత్వ హయాంలో గిరిజన చట్టాలను లెక్కచేయకుండా స్వార్థపూరితంగా అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వారిపై తీవ్రంగా పోరాటం చేశామని, బెదిరింపులు, బుజ్జగింపులు ఎదురైనా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
“గత ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాలను దోచుకోవడమే లక్ష్యంగా పాలన సాగించాయి. వారి అవినీతి, గుత్తాధిపత్య ధోరణుల వల్లే నేడు గిరిజన యువత ఉద్యోగావకాశాలకు దూరంగా నిలబడింది. GO 3 లాంటి కీలక ఉత్తర్వును కోల్పోవడానికి వైసీపీ ప్రభుత్వమే బాధ్యతవహించాలి” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం జనసేన పార్టీ పటిష్ఠంగా ముందుకు సాగుతోందని, గిరిజన సంస్కృతి, భాష, సంప్రదాయాలను కాపాడుకునే ఏకైక మార్గం జనసేన పార్టీయేనని మురళి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో పార్టీ సెంట్రల్ కమిటి సభ్యులతోపాటు, ఐటీ ఇంచార్జీ దండుసేన నవీన్ కుమార్, ఉమ్మడి జిల్లా కార్యదర్శి మల్లంగి శ్రీనివాస్ రెడ్డి, నేతలు సమర్డి రఘునాథ్, పాంగి లక్ష్మణ్, కిల్లో బుజ్జిబాబు, రామారావు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


