ఆంధ్రప్రదేశ్ అల్లూరుజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 25: ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అరకులోని వేలి మండల కేంద్రంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆదివాసీ షెడ్యూల్ ఏరియాలో ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ, ఇటీవల విడుదల చేసిన మెగా డీఎస్సీలో ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. “అరకులో జరిగిన ఎన్నికల సభలో, ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జీవో నంబర్ 3 చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ తాజా నోటిఫికేషన్‌లో పాడేరు ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ శాఖకు చెందిన 400 పోస్టుల్లో కేవలం 24 పోస్టులు మాత్రమే ఆదివాసులకు కేటాయించడం తీవ్రంగా నిరాశ కలిగించింది,” అని వారు పేర్కొన్నారు.
శాశ్వత నివాసాలకు అనుమతి లేని గిరిజనేతరులకు 376 పోస్టులు కేటాయించడాన్ని ఆదివాసులపై చేసిన ద్రోహంగా అభివర్ణించారు. షెడ్యూల్ ఏరియాలో 1/70 చట్టం ప్రకారం స్థానిక ఆదివాసులకు మాత్రమే ఉపాధి అవకాశాలు కల్పించాలన్న నిబంధనను ఉల్లంఘించారని మండిపడ్డారు.
“ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, ఆదివాసులకు 100 శాతం రిజర్వేషన్ కల్పించేలా నియామక చట్టం కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలి. అదివాటితో పాటు ప్రత్యేక ఆదివాసీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలి,” అని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జి. బుజ్జిబాబు, నాయకులు కిల్లో జగన్నాధం, కిల్లో ముకుందు, పి. నాని బాబు, కె. బుజ్జిబాబు, జి. మల్లేష్, జి. సుబ్బారావు, ఓ. అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


