
Free Travel : త్రినేత్రం న్యూస్ : ఏపీ ప్రజలకు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీపికబురు చెప్పారు. ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల్ని పల్లె వెలుగు సర్వీసుల్లాగే గ్రామాలకు కూడా నడుపుతామన్నారు.
ఈ ఏసీ బస్సుల్లో కూడా స్త్రీ శక్తి పథకం అమలు చేస్తారు. 2029 నాటికి మొత్తం 5,210 బస్సులు ఆర్టీసీ లోకి తీసుకుంటామన్నారు.. 2031 నాటికి ఆర్టీసీలో పూర్తిగా విద్యుత్, సీఎన్‌జీ బస్సులే ఉంటాయన్నారు. రాష్ట్రంలో మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం ఇప్పటి వరకు 73.62 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలతో సూపర్ సక్సెస్ అయ్యిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉచిత బస్సు ప్రయాణలకు సంబంధించి సబ్సిడీ కింద రోజుకు రూ.8.50 కోట్లు చెల్లిస్తోందన్నారు. దివ్యాంగ శక్తి పథకానికి మంచి ఆదరణ వస్తోందని.. ఇప్పటి వరకు 38.22 లక్షల ప్రయాణాలు చేశారన్నారు. స్త్రీశక్తి, దివ్యాంగ శక్తి పథకాల అమలు చేసిన తర్వాత బస్సుల అక్యుపెన్సీ 69 శాతం నుంచి 92 శాతానికి పెరిగిందన్నారు.
కేంద్రం సహకారంతో రాష్ట్రానికి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను మంజూరైనట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఐదేళ్లలో మొత్తం 8321 విద్యుత్ బస్సులను జీసీసీ (గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్) విధానం ద్వారా దశలవారీగా ప్రవేశపడతామన్నారు. పీఎం ఈ-బస్ సేవ పథకం కింద 750 విద్యుత్ బస్సుల్ని 11 నగరాల్లోని 12 డిపోలకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ 750 బస్సులు ఆగస్టు నెల నుంచి దశల వారీగా అందుబాటులోకి వస్తాయన్నారు. కేంద్రం తిరుపతికి అదనంగా 300 ఈ-బస్సులను మంజూరు చేయగా.. టెండర్ల ప్రక్రియ మొదలైందన్నారు. కేంద్రానికి ఏపీ తరఫున పూర్వోదయ పథకం కింద బస్సుల కేటాయింపు కోసం ప్రతిపాదనలు పంపించామన్నారు. ఆర్టీసీకి సంబంధించిన భూమిని, ఆర్టీసీ డిపోను ఎవరికీ అప్పగించే ఉద్దేశం లేదన్నారు. ఆర్టీసీ పరిధిలోనే ఉంటాయన్నారు మంత్రి.
ఆర్టీసీలోకి తీసుకొచ్చే ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు రవాణాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు. జీసీసీ విధానంలో ఆర్టీసీ యాజమాన్య హక్కులు, డ్రైవర్ల నిర్వహణ, ఆదాయ నిర్వహణ, కార్యకలాపాల పర్యవేక్షణ ఆర్టీసీ ఆధీనంలోనే ఉంటాయన్నారు. ఆ ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి ప్రైవేటు భాగస్వామ్య సంస్థలకు బస్సుల నిర్వహణ, ఛార్జింగ్ పాయింట్ల మౌలిక సదుపాయాల నిర్వహణ మాత్రమే ఉంటుందన్నారు. ఈ విద్యుత్ బస్సులకు సంబంధించి ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్‌లకు ప్రత్యేకంగా శిక్షణ అందిస్తామన్నారు.. రాబోయే రోజుల్లో ఆర్టీసీనే ఈ సేవలను నిర్వహించేలా చేస్తామన్నారు.
రాష్ట్రంలో రోడ్డు భద్రతపై నిఘా, బస్సు కదలికలపై మానిటరింగ్‌కు కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రాష్ట్రంలో పాతవాహనాలకు గ్రీన్‌ట్యాక్స్ తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఏపీలో నడిచే ట్రావెల్స్ బస్సుల్ని తగ్గిస్తామన్నారు. ఆ బస్సులు ఏపీకి వచ్చి రీరిజిస్ట్రేషన్ చేసుకుంటాయన్నారు. రాష్ట్రంలో తిరిగే 1,800 ఏఐటీపీ బస్సులు గంటకు 80 కి.మీ. వేగాన్ని మించి వెళ్లకుండా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe