Free Training : గిరిజన మహిళలకు ఆధునిక సాంకేతికతతో హస్తకళలపై ఉచిత శిక్షణ

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా,మార్చి 6, (త్రినేత్రం న్యూస్): గిరిజన మహిళలను ఆర్థికంగా సాధికారత కల్పించడంతో పాటు వారికి స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆధునిక సాంకేతికతతో కూడిన సాంప్రదాయ హస్తకళలపై ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఎ) పాడేరు ప్రాజెక్టు అధికారి, ఇన్‌చార్జ్ జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ తెలిపారు.
ఐటిడిఎ పాడేరు ఆధ్వర్యంలో గాయత్రి విద్యాపరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ మరియు భారత ప్రభుత్వం డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) స్వయం సహాయక సంఘాల (ఎస్. హెచ్.జి) మహిళా సభ్యులు మరియు హస్తకళలు విక్రయించే మహిళల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో సాంప్రదాయ హస్తకళలను ఆధునిక త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో సమన్వయం చేస్తూ “బ్యాంబూ ఫ్యూషన్” (వెదురు అల్లకళ) విధానంలో శిక్షణ అందించనున్నారు. ఈ విధానం ద్వారా గిరిజన మహిళలకు కొత్త నైపుణ్యాలు అందించి వారి జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ ప్రాజెక్టు భాగంగా కనీసం 10వ తరగతి విద్యార్హత కలిగిన 30 మంది ఎస్టీ మహిళలు మరియు హస్తకళలు విక్రయించే ఎస్టీ సభ్యులకు ఈ నెల 9 మరియు 10 తేదీలలో రెండు రోజుల పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కాఫీ హౌస్ వద్ద ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది.
అర్హత కలిగిన ఎస్టీ మహిళా సభ్యులు తమ విద్యార్హత సర్టిఫికెట్ మరియు ఎస్టీ కుల ధృవపత్రాలు జతచేసి ఈ నెల 7వ తేదీలోపు ఐటిడిఎ పాడేరు కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ ఒక ప్రకటనలో తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Free training on handicrafts with modern technology

You cannot copy content of this page

Scroll to Top