అల్లూరిజిల్లా అరకులోయ డిసెంబర్ 28, (త్రినేత్రంన్యూస్): ప్రభుత్వ పాఠశాలలు, గిరిజన సంక్షేమ, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు వచ్చే ఏడాది జరిగే పబ్లిక్ పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించాల్సిందేనని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.
100 డేస్ యాక్షన్ ప్లాన్‌ను కచ్చితంగా అమలు చేయాలని, నిర్లక్ష్యం వహించిన పాఠశాలలపై కఠిన చర్యలు తప్పవని ఆయన తేల్చి చెప్పారు. శనివారం కలెక్టర్ తన చాంబర్ నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 10వ తరగతి ఫలితాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
“ఈ ఏడాది 10వ తరగతి ఫలితాలు జిల్లాకు ప్రతిష్ఠాత్మకం. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాల్సిందే. అందుకు ఉపాధ్యాయులు పూర్తి బాధ్యత తీసుకోవాలి” అని ఆదేశించారు. 100 రోజుల కార్యాచరణ తప్పనిసరి డిసెంబర్ 6 నుంచి 2026 మార్చి వరకు అమలు చేయనున్న 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను ప్రతి పాఠశాల తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.
ఈ ప్రణాళికను ఐటీడీఏ పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన మానిటరింగ్ సిస్టం ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి.. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు, పునరావృత పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పోటీ పరీక్షలకు హాజరుకాని విద్యార్థులను ప్రత్యేకంగా ట్రాక్ చేసి మెరుగైన ఫలితాలు తీసుకురావాలని స్పష్టం చేశారు.
నిర్లక్ష్యానికి చోటు లేదు ..పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయాలని, ఎక్కడైనా నిర్లక్ష్యం కనిపిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె.కృష్ణారావు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పీబికే పరిమళ, మండల విద్యాశాఖ అధికారులు, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


