మండలంలో మేడే కార్యక్రమాలు ఘనంగా నిర్వహణ.వి. ఉమామహేశ్వర్
అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్, మే 2: కార్మికులను బానిసలుగా మారుస్తున్న నాలుగు లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. మేడే సందర్భంగా బుధవారం మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని భవ్యంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులకు గండికొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ అమలయితే కనీస వేతన చట్టం, పరిశ్రమల వివాదాల పరిష్కార చట్టం, కార్మిక సంఘాలు ఏర్పరచుకునే హక్కు లాంటివి పూర్తిగా కాలరాసే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 20న జరిగే జాతీయ సమ్మెలో కార్మిక వర్గం విస్తృతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎనిమిది గంటల పని దినం సాధించిన మేడే స్ఫూర్తితో ఉద్యమం కొనసాగించాలని చెప్పారు.
ఈ దేశంలో సంపద సృష్టించేది కార్మిక వర్గమే అయినప్పటికీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొద్ది మంది ధనవంతుల పక్షాన నిలుస్తున్నాయని విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయించిన చరిత్రను గుర్తు చేస్తూ, కార్మిక వర్గం కూడా కేంద్రాన్ని ఒత్తిడికి గురిచేసి లేబర్ కోడ్స్‌ను రద్దు చేయించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు మండలంలోని సుంకరమెట్ట, కొత్తవలస హెచ్ఎంటిసి, పద్మాపురం గార్డెన్, ఏపీ టూరిజం మయూరి, ఏరియా ఆసుపత్రి, గిరిజన మ్యూజియం, భవన నిర్మాణ రంగాల్లో మేడే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రధాన రహదారులపై కార్మికులు జెండాలు చేతబట్టి నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి జర్నీ భగత్ రాం, ఐటిడిఏ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రాజు, కార్పెంటర్స్ యూనియన్ నాయకులు ప్రభుదాసు, శ్రీను, అంగన్వాడి సంఘం జిల్లా అధ్యక్షులు నాగమ్మ, ప్రాజెక్ట్ అధ్యక్షులు వెంకటలక్ష్మి, ఆటో వర్కర్స్ యూనియన్ నేతలు శ్రీను, రమేష్, హాస్టల్ వర్కర్స్ నేత కొండలరావు, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు వివి జయ, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పి. బాలదేవ్, టూరిజం వర్కర్స్ యూనియన్ నేత బాబురావు, వనాది, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొండలరావు, తేజావలి పెయింట్ సంగం నాయకులు రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


