
అరకులోయలో యథేచ్ఛగా ఆక్రమణలు.. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు
Protection Government Lands : అరకులోయ,అక్టోబర్ 9, (త్రినేత్రం న్యూస్) : అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యాటక కేంద్రమైన అరకులోయలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి చెందిన విలువైన స్థలాలను కొందరు వ్యక్తులు ఆక్రమించి వాటిపై నివాస గృహాలు, దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నప్పటికీ సంబంధిత రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రత్యేకంగా గాంధీ పార్క్, ఐటీడీఏ షాపింగ్ కాంప్లెక్స్, ఐటీడీఏ క్వార్టర్స్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల వినియోగం, ఆక్రమణలపై సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని సామాజిక కార్యకర్త, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు సుజాత సల్మాన్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ స్థలాలను అక్రమంగా ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారుతున్నా, ప్రజాప్రతినిధులు మారుతున్నా ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో మాత్రం పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని పేర్కొన్నారు.
ఒకవైపు ప్రభుత్వ భూములపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తుండగా, మరోవైపు సాధారణ ప్రజలు చిన్న ఇల్లు లేదా దుకాణం నిర్మించుకునే సమయంలో మాత్రం నిబంధనలు, పత్రాల పేరుతో అధికారులు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారని సుజాత సల్మాన్ ఆరోపించారు. దీంతో అధికారుల వ్యవహారశైలిపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.
అరకులోయ వంటి కీలక పర్యాటక ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలపై నిరంతరం నిఘా ఉంచాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగంపై ఉందని ఆమె అన్నారు. ప్రభుత్వ భూములను గుర్తించి, వాటి హద్దులను నిర్ధారించి, అక్రమ నిర్మాణాలు జరిగాయా లేదా అనే అంశంపై సమగ్ర సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
అక్రమ ఆక్రమణలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు పారదర్శకంగా విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని ఆమె కోరారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో నిర్లక్ష్యం జరిగితే భవిష్యత్తులో ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లడంతో పాటు, అమాయక గిరిజనులు తమ హక్కులు, ఆస్తులను కోల్పోయే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని సుజాత సల్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ స్థలాల పరిరక్షణపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి, అరకులోయలోని ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో ఆదివాసి పరిరక్షణ సమితి చైర్మన్ చట్టూ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe