అక్టోబర్ 29, 2026
TRINETHRAM NEWS
local body elections

Local Body Elections : పాడేరు,అరకులోయ అక్టోబర్ 9,(త్రినేత్రం న్యూస్): రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అధికారులు పకడ్బందీగా సన్నద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు. గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల ఏర్పాట్లు, వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా తదితర అంశాలపై సమీక్షించారు.
గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, మున్సిపల్ సంస్థల ఎన్నికలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది, ఎన్నికల సామగ్రి, పోలింగ్ కేంద్రాలు, శిక్షణ తదితర ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలకు తావులేకుండా జిల్లా యంత్రాంగం, ఎన్నికల అధికారులు, పోలీసు శాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన వార్డుల పునర్విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్లకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ప్రతిపాదనలను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన ఓటర్ల జాబితా ప్రక్రియను కూడా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పూర్తి చేయాలన్నారు.
ఎన్నికల షెడ్యూల్, తేదీలు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న అనధికారిక సమాచారం, వదంతులు, ఊహాగానాలను ప్రజలు నమ్మవద్దని పునేఠా స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసే ప్రకటనలు, నోటిఫికేషన్లు, మార్గదర్శకాలను మాత్రమే ప్రామాణికంగా పరిగణించాలని సూచించారు.
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు శాఖ ముందస్తు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి నిబంధనలు, బాధ్యతలు, పోలింగ్ విధానంపై సమగ్ర శిక్షణ ఇవ్వాలని సూచించారు.
అవసరాన్ని బట్టి స్థానిక సంస్థల ఎన్నికలను దశలవారీగా నిర్వహించేందుకు జిల్లాల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఏఎస్పీ శృతి, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, డివిజనల్ పంచాయతీ అధికారి కుమార్, డీడీఓ జయప్రకాశ్, ఎంపీడీఓలు తదితర అధికారులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page