
Shelter Provided : హుకుంపేట అక్టోబర్ 9, (త్రినేత్రం న్యూస్) : తల్లిదండ్రుల సంరక్షణకు దూరమైన ఇద్దరు బాలురకు అల్లూరి సీతారామరాజు జిల్లా బాలల సంరక్షణ విభాగం అండగా నిలిచింది. హుకుంపేట మండలం పెదగరువు గ్రామానికి చెందిన ఇద్దరు బాలురను విశాఖపట్నంలోని బాలల సంరక్షణ సంస్థ ‘పాప హోమ్’లో చేర్పించి సురక్షితమైన ఆశ్రయం కల్పించారు.
పెదగరువు గ్రామానికి చెందిన కొర్ర బాబురావు అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయనకు భార్య గంగభవానితో ముగ్గురు సంతానం ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు కొర్ర విజయకుమార్ (12), చిన్న కుమారుడు లిఖిత్ కుమార్ (9) కాగా, కుమార్తె అనూష (5) ఉన్నారు. బాబురావు మృతి అనంతరం తల్లి గంగభవాని ఇతర వ్యక్తిని వివాహం చేసుకోవడంతో పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణకు దూరమయ్యారు.
ఈ విషయం జిల్లా బాలల సంరక్షణ విభాగం దృష్టికి రావడంతో అధికారులు స్పందించారు. విశాఖపట్నం బాలల సంక్షేమ కమిటీ అనుమతితో విజయకుమార్, లిఖిత్ కుమార్ ఇద్దరినీ గురువారం విశాఖపట్నంలోని ‘పాప హోమ్’ బాలల సంరక్షణ సంస్థలో చేర్పించారు. ప్రస్తుతం అనూషను పెదగరువు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం సంరక్షణలో ఉంచారు. త్వరలోనే ఆమెను కూడా చైల్డ్ కేర్ సెంటర్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.
జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ టి. సద్దు మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడైనా తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు, బాలకార్మికులు లేదా ఆపదలో ఉన్న బాలబాలికలు కనిపిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం అందించాలని కోరారు. బాలల హక్కులను కాపాడటంతో పాటు వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు, జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్‌వైజర్, విశాఖపట్నం పాప హోమ్ సిబ్బంది, పెదగరువు గ్రామస్తులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe