CITU : అరకువ్యాలీ ఐటీడీఏ కార్మికులకు కనీస వేతనం రూ.26,000 చెల్లించాలి సీఐటీయూ డిమాండ్

TRINETHRAM NEWS

అరకులోయ జనవరి 10, (త్రినేత్రంన్యూస్): అరకు వ్యాలీ ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు చట్టప్రకారం కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. శుక్రవారం అరకు వ్యాలీ గిరిజన మ్యూజియం ఎదుట భోజన విరామ సమయంలో ఐటీడీఏ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, గిరిజన మ్యూజియంలో 20 నుంచి 30 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కార్మికులకు సరైన వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల ప్రకారం వారికి కనీస వేతనం రూ.26,000 చెల్లించాల్సి ఉండగా, ఐటీడీఏ అధికారులు ఆ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.
పీఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయకపోవడం ద్వారా కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని తెలిపారు. ఈ అంశంపై గతంలోనే పీఎఫ్, ఈఎస్ఐ ప్రధాన కార్యాలయాలకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లభించలేదన్నారు.
పద్మాపురం, కొత్తవలస హెచ్‌ఎన్‌టీసీ కార్మికులకు సంబంధించి 2010–11 సంవత్సరాల్లో జీతాల నుంచి పీఎఫ్ కటింగ్ చేసినప్పటికీ, ఆ మొత్తాన్ని పీఎఫ్ ఖాతాల్లో జమ చేయలేదని వెల్లడించారు. ఆ నిధులను కార్యాలయాల వద్దనే ఉంచుకున్న బాధ్యులపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గ్రీవెన్స్ డే సందర్భంగా పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫిర్యాదులకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన మ్యూజియం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ, అక్కడ పనిచేస్తున్న కార్మికుల విషయంలో అధికారులు చవట తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. మ్యూజియం ఆదాయాన్ని ఇతర ఖర్చులకు వినియోగిస్తున్న అధికారులు, కార్మికులకు చట్టప్రకారం ఇవ్వాల్సిన వేతనాలు, పీఎఫ్ సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.
తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్లేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఇప్పటికే వినతిపత్రం రూపంలో సమ్మె నోటీసు కూడా అందజేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు దాడి రాజు, బృంద, కమల, వంతల రాజు, జయరాజు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CITU demands minimum wage

You cannot copy content of this page

Scroll to Top