జూన్ 25, 2026
TRINETHRAM NEWS
Camp Office Inaugurated

Camp Office Inaugurated : అరకులోయ, జూన్ 26 (త్రినేత్రం న్యూస్): రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా అంతం చేయాలనే ప్రతిపక్షాల ప్రయత్నాలు ఫలించవని, గతం కంటే పార్టీ మరింత బలోపేతమై ప్రజల్లో ఆదరణ పొందుతోందని అరకు పార్లమెంట్ సభ్యురాలు తనూజా రాణి అన్నారు. అరకు ఎంపీగా ఎన్నికై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అరకులోయలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ క్యాంపు కార్యాలయాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డా. కుంభా రవిబాబు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరస విశ్వేశ్వర రాజు.హాజరై రిబ్బన్ కటింగ్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ తనూజా రాణి మాట్లాడుతూ, గతంలో అరకు ఎంపీలు ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలు వచ్చాయని, వాటికి చెక్ పెట్టేందుకే పార్లమెంట్ ప్రధాన కేంద్రంలో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సూచనల మేరకు ప్రజలకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో ఈ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
ఇకపై ప్రతి వారం మూడు రోజుల పాటు కార్యాలయంలో అందుబాటులో ఉంటానని, పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు తమ సమస్యలను నేరుగా వినిపించవచ్చని తెలిపారు. గిరిజనుల హక్కులు, చట్టాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తూ, అలాంటి చర్యలను ప్రజలతో కలిసి తిప్పికొడతామని హెచ్చరించారు.
గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన జీవో నెం.3 అమలు కోసం ఇప్పటికే తొమ్మిది సార్లు లోక్‌సభలో ప్రస్తావించానని, కేంద్ర మంత్రులు, రాష్ట్రపతిని కలిసి వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. అరకు ఏజెన్సీలో హైడ్రో ప్రాజెక్టులు, బాక్సైట్ తవ్వకాల పేరిట జరుగుతున్న సర్వేలను తీవ్రంగా ఖండించిన ఆమె, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 30 రోజుల్లోనే బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తూ జీవో నెం.97 జారీ చేశారని గుర్తు చేశారు.
పార్లమెంట్ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో నివాస హక్కులకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును కూడా పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని తెలిపారు. గత రెండేళ్లలో గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవల మెరుగుదల కోసం 10 అంబులెన్సులు అందించడంతో పాటు సుమారు రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు.
అనంతగిరి మండలంలోని తారాబు జలపాతం అభివృద్ధికి ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే అరకు, పాడేరు నియోజకవర్గాల పరిధిలోని 36 పాఠశాలలకు ఆర్వో ప్లాంట్లు మంజూరు చేసి మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 1/70 చట్టం, పీసా చట్టం అమలుతో పాటు గిరిజనుల సమస్యలను రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించనున్నట్లు తెలిపారు.
ఇటీవల కురుపాం, జి.కె.వీధి ప్రాంతాల్లో కలుషిత నీరు, ఆహారం కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గురైన ఘటనల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. అనంతగిరి మండలం చిలకలగడ్డ బాలుర పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థి మృతి ఘటనపై స్పందిస్తూ, విద్యార్థి కుటుంబానికి రూ.10 లక్షలకు పైగా నష్టపరిహారం చెల్లించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పర్యాటకం, వైద్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తున్నట్లు ఎంపీ తెలిపారు.
ఎమ్మెల్యే గైర్హాజరు చర్చనీయాంశం… ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అరకు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే వర్గం, ఎంపీ వర్గంగా రెండు వర్గాలు ఉన్నాయనే ప్రచారానికి ఈ పరిణామం మరింత బలం చేకూర్చిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారుఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గిరిజన సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page