• జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ‘అరైవ్ – అలైవ్’ (ARRIVE – ALIVE) అవగాహనా సదస్సు
- గత ఏడాది కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల వల్ల 200 మంది మృతి: ఆందోళన వ్యక్తం చేసిన సీపీ
Trinethram News : కరీంనగర్, జనవరి 20, 2026: రోడ్డు ప్రమాదాల నివారణ కేవలం పోలీసుల చర్యలతోనే సాధ్యం కాదని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి, వాటిని బాధ్యతాయుతంగా పాటించినప్పుడే ప్రమాద రహిత సమాజం సాధ్యమవుతుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అన్నారు.
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ‘అరైవ్ – అలైవ్’ (ARRIVE – ALIVE) అవగాహనా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సీపీ ప్రసంగిస్తూ కీలక అంశాలను వెల్లడించారు.
ప్రధానాంశాలు: ప్రాణనష్టానికి మానవ తప్పిదాలే కారణం: గత ఏడాది కమిషనరేట్ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వల్ల 200 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని సీపీ అన్నారు. ఇందులో ఎక్కువ శాతం ప్రమాదాలు సీట్ బెల్టు ధరించకపోవడం, హెల్మెట్ లేకపోవడం, అతివేగం మరియు మద్యం సేవించి వాహనం నడపడం వంటి మానవ తప్పిదాల వల్లే జరిగాయని తెలిపారు.
85 శాతం బాధితులు పురుషులే: ప్రమాదాల్లో మరణించిన వారిలో 85 శాతం మంది పురుషులు ఉండటం గమనార్హమని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక నిఘా: కరీంనగర్ నుండి హైదరాబాద్, వరంగల్, జగిత్యాల, సిరిసిల్ల మరియు చొప్పదండి వెళ్లే ప్రధాన రహదారుల్లో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న ‘బ్లాక్ స్పాట్లను’ గుర్తించామని సీపీ తెలిపారు. అక్కడ ప్రత్యేక నిఘాతో పాటు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవరచుకోవాలి: రాష్ట్ర డీజీపీ ప్రారంభించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నామని.. పరిసరాలను గమనిస్తూ వాహనం నడిపే ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ పద్ధతిని ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా సీపీ తన విద్యార్థి దశలో ఎదుర్కొన్న అనుభవాలను ఉదాహరణగా చెబుతూ రోడ్డు భద్రత ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అంతేకాకుండా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరితో రోడ్డు భద్రత నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, డిటివో శ్రీకాంత్ చక్రవర్తి, ఏసీపీలు వెంకటస్వామి, యాదగిరి స్వామి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరా స్వామి, డాక్టర్ సాయిదీప్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ నీలం సంపత్, ఇన్స్పెక్టర్లు రాంచందర్ రావు, సృజన్ రెడ్డి మరియు వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


