నిత్య విద్యార్థి డాక్టర్ కర్రి రామారెడ్డి ఖాతాలో మరో మైలురాయి

TRINETHRAM NEWS

-డబ్బయ్యేళ్ళ వయసులో డిగ్రీల స్కోరు 61 నాటవుట్
-తాజాగా పూర్తిచేసిన11కోర్సుల్లో ఎనిమిదింట టాపర్ .. మరోసారి మెగాస్టార్ విభాగంలో చేర్చనున్న ఎన్ పి టెల్
-తుదివరకు విద్యాప్రస్థానం సాగించడమే సరస్వతి పుత్రుని ఆకాంక్ష
డా రామారెడ్డి విద్వత్ గుర్తించి పద్మశ్రీ ఇవ్వాలి : డా గన్ని భాస్కరరావు
-డా రామారెడ్డి ప్రయత్నం యువతకు స్ఫూర్తి : ఓలేటి సత్యనారాయణ

Trinethram News : రాజమహేంద్రవరం, మే 20: నిత్యవిదార్థిగా ఇప్పటికే 50డిగ్రీలు పూర్తిచేసిన ప్రముఖ మానసిక వైద్యుడు, రాష్ట్రపతి పురస్కారగ్రహీత (డాక్టర్ బీసీ రాయ్ అవార్డు) డాక్టర్ కర్రి రామారెడ్డి తాజాగా మరో 11డిగ్రీలు పూర్తిచేశారు. ఈ పదకొండు కోర్సులు కూడా ఎలైట్ ప్లస్ సిల్వర్ (డిస్టింక్షన్ తో సమానం), ఎలైట్ ప్లస్ గోల్డ్ (90శాతం పైన మార్కులు) తో సాధించినవే కావడం విశేషం. మూడు డాక్టరేట్లు, ఐదు ఎల్ఎల్ఎంలు, ఎంబిఏ, ఎంసిఎ, ఎంటెక్, ఎంఏ, ఎంకామ్.. ఇలా డిగ్రీలమీద డిగ్రీలు సాధిస్తూ, విభిన్న రంగాలలో వివిధ కాలిఫికేషన్స్ కలిగి ప్రపంచ రికార్డుల్లో నిలిచిన వ్యక్తి డాక్టర్ రామారెడ్డి.

ఈయన విద్యాప్రస్థానం ఇప్పుడు మరింత ప్రభావవంతంగా మారింది. 70 ఏళ్ళవయసులో (అధికారికంగా 72) కూడా నిరంతర విద్యా ప్రయాణానికి ప్రేరణగా నిలుస్తూ, మరో విశిష్ట మైలురాయి చేరుకున్నారు. ఈనేపధ్యంలో స్థానిక మానస హాస్పిటల్ లో మంగళవారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డా రామారెడ్డి ఏడాదికి రెండు మూడు డిగ్రీలు మాత్రమే పూర్తిచేస్తున్న సమయంలో ఇంకా ఎక్కువ కోర్సులు కొందరు ఎలా చేస్తున్నారని గమనించి సర్టిఫికెట్ కోర్సులు కూడా చేయడం ప్రారంభించా నని తెలిపారు. గత ఏడాది ఇలాగే కొన్ని కోర్సులు చేయడంతో 50పూర్తయ్యాయని, ఈ ఏడాది జనవరి-జూన్ఒకే సెమిస్టర్ లో 11 ఎన్ పి టెల్ కోర్సులు ఒకేసారి పూర్తిచేసినట్లు ఆయన చెప్పారు.

ఈ 11 కోర్సుల్లో ఎనిమిది కోర్సులు లో టాపర్లలో ఒకరుగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. ఒకే సెమిస్టర్ లో ఏదైనా ఆరు కోర్సులకు టాపర్ గా వస్తే ఎన్ పి టెల్ మెగా స్టార్ విభాగంలో చేరుస్తారు. గత సెమిస్టరులో ఆరు కోర్సులకి టాపర్ గా వచ్చి ఆ గౌరవాన్ని పొందానని ఆయన గుర్తుచేశారు. మరి ఇప్పుడు ఎనిమిది కోర్సుల్లో టాపరుగా, మళ్ళీ ఇంకొకసారి మెగాస్టార్ గుర్తింపునకు అర్హత సంపాదించడం ఆనందదాయకమని అన్నారు
దేశంలో ఏడు ప్రతిష్టాత్మకమైన ఐ ఐ టి లు, ఒక ఐ ఐ ఎస్ సి ల సముదాయమే ఎన్ పి టెల్ అని డా రామారెడ్డి చెబుతూ, ఒక్కొక్కరు ఏటా 800కోర్సుల చొప్పున అఫర్ చేస్తుంటారని తెలిపారు. ఖరగ్ పూర్ ఐ ఐ టి నుంచి 4కోర్సులు, బోంబే ఐ ఐ టి నుంచి 3కోర్సులు, మద్రాస్ ఐ ఐ టి నుంచి 3కోర్సులు, గువహాతి ఐ ఐ టి నుంచి ఒక కోర్సు వెరసి 11కోర్సులు పూర్తిచేసానని ఆయన వివరించారు. ఈ కోర్సులన్నింటికీ స్థానిక రాజీవ్ గాంధీ కాలేజీ సెంటర్ కావడం వలన వేరే ప్రాంతానికి వెళ్లనవసరం లేకుండా ఇక్కడే పూర్తిచేయడానికి వీలైందని ఆయన వివరిస్తూ, రాజీవ్ గాంధీ కాలేజీ సెక్రటరి అండ్ కరస్పాండెంట్ జివి హర్షకుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. వీటితో కల్పి ఇప్పటివరకు పూర్తయిన 61కోర్సులన్నీ కూడా చదువు ద్వారా, పరీక్షలు రాయడం ద్వారా, శ్రమించి తెచ్చుకున్నవేతప్ప ఏ ఒక్కటి కూడా ఆనరరీ డిగ్రీ, ఫెలోషిప్ పదవివలన వచ్చినవి కాదని డా రామారెడ్డి గుర్తుచేసారు. చదువు అనేది తన జీవితంలో ఒక భాగంగా మారిందని ఆయన పునరుద్ఘాటిస్తూ, అవార్డుల కోసమో, రికార్డుల కోసమో కాకుండా చదువుకు వయస్సుతో సంబంధం లేదని కూడా దీనివలన రుజువు చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. నిరంతర శ్రమ, పట్టుదల ఉంటె ఎవరైనా చదువు కొనసాగించవచ్చని ఆయన సూచించారు. “ఊపిరి ఉన్నంతవరకు నా విద్యా ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుంది” అని ఆయన స్పష్టంచేశారు. ఈయన విజేత మాత్రమే కాదు, చదువు కోసం నిరంతరం కృషి చేయాలనే ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి సూచించే ఒక ప్రేరణాత్మక శక్తిగా చెప్పవచ్చు.
జిఎస్ ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ డా గన్ని భాస్కరరావు మాట్లాడుతూ 70ఏళ్ల వయస్సులో 61డిగ్రీలు సాధించడం మామూలు విషయం కాదన్నారు. ఇలాంటి వ్యక్తికీ ప్రభుత్వం పిలిచి పద్మశ్రీ పురస్కారం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నిత్యం యోగా చేయడం వలన శరీరానికి ,మనస్సుకి ఎలా శక్తి వస్తుందో, నిత్యం చదవడం వలన మెదడు చురుకుగా ఉంటుందని డా భాస్కరరావు విశ్లేషించారు. ఆర్ ఎస్ ఎస్ రాష్ట్ర నాయకుడు ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ డా రామారెడ్డి ఆర్ ఎస్ ఎస్ లో బాధ్యతలు నిర్వహిస్తూ, ఒక డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూ, ఇన్ని డిగ్రీలు సాధించడం తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు. డా రామారెడ్డి ప్రయత్నం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. వచ్చే ఏడాది నుంచి సంఘ్ కి పూర్తిసమయం వెచ్చించడానికి అంగీకరించిన డా రామారెడ్డి నిత్యవిద్యార్ధిగా కూడా తన సోపానం కొనసాగించగలరని పేర్కొన్నారు. ఐ ఎం ఏ సెక్రటరీ డా దాట్ల సతీష్, పివిఎస్ కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్బంగా డా రామారెడ్డిని పలువురు సత్కరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Another milestone in the

You cannot copy content of this page

Scroll to Top