
Adivasi Tribal Association : అల్లూరిజిల్లా అరకులోయ జూలై 21,(త్రినేత్రంన్యూస్) : ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ అన్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైడ్రో పవర్ ప్రాజెక్టులు, బాక్సైట్ సర్వేల పేరుతో అనుమతులు లేకుండా డ్రోన్లు వినియోగిస్తూ అక్రమ సర్వేలు నిర్వహిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అరకువేలిలోని ఆదివాసీ గిరిజన సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా నాయకులు జి. బుజ్జిబాబు, కె. జగన్నాథంతో కలిసి ఆయన మాట్లాడారు. పాడేరులో జూలై 17న నిర్వహించిన “చలో పాడేరు” మహాధర్నా సందర్భంగా కొందరు నాయకులు ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో, అలాగే సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు అనుమతి లేకుండా డ్రోన్లు వినియోగించారనే ఆరోపణలపై 18 మందిపై కేసులు నమోదు చేయడం అన్యాయమని విమర్శించారు.
మహాధర్నాకు హాజరయ్యేందుకు వచ్చిన ఆదివాసీ ప్రజలను పోలీసులు ఉదయం నుంచే తనిఖీల పేరుతో అడ్డుకోవడం, పలు ప్రాంతాల్లో పోలీస్ అవుట్‌పోస్టులు ఏర్పాటు చేసి నిర్బంధించడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు. మరోవైపు గత ఆరు నెలలుగా హైడ్రో పవర్ ప్రాజెక్టులు, బాక్సైట్ అన్వేషణ పేరుతో వందలాది డ్రోన్లు గ్రామాలపై తిరుగుతున్నప్పటికీ, గ్రామసభల అనుమతి లేకుండా సర్వేలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
ఈ అక్రమ సర్వేలపై ఆదివాసులు లిఖితపూర్వక ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం, పోలీసులు స్పందించకుండా కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. ఉద్యమ నాయకులపై రోడ్లు దిగ్బంధం చేశారనే, పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదివాసీలకు ఇచ్చిన హామీలను అమలు చేసి, ప్రత్యామ్నాయ జీవోపై వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. బహిరంగ వ్యాఖ్యలపై తక్షణ చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, రాజ్యాంగబద్ధమైన హక్కుల అమలులో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించడం సరికాదన్నారు. సమస్యల మూలాలను పరిష్కరించకుండా అణచివేత చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.
1/70 చట్టాన్ని రద్దు చేయాలంటూ 2023లో 1,672 మంది గిరిజనేతరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు గత ప్రభుత్వం గానీ, ప్రస్తుత ప్రభుత్వం గానీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడం ఆదివాసీ హక్కుల పరిరక్షణపై ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. ఐటీడీఏ ద్వారా ఎల్‌టీఆర్ కేసులు నమోదు చేయకపోవడం, మరోవైపు కార్పొరేట్ సంస్థలకు అటవీ సహజ వనరుల వినియోగానికి అవకాశం కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఆదివాసీల భూమి హక్కులు, అటవీ హక్కులు, స్వయం పాలనా హక్కులు, 100 శాతం రిజర్వేషన్ వంటి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులు, బెదిరింపులు, అణచివేత చర్యలను విరమించి రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించాలని కోరారు. లేనిపక్షంలో రాజ్యాంగబద్ధమైన మార్గాల్లో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జి. బుజ్జిబాబు, కె. జగన్నాథం, టి. జోషి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe