ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Public Grievance Redressal Platform

రెవెన్యూ నుంచి సంక్షేమ పథకాల వరకు 88 వినతులు

Public Grievance Redressal Platform : డుంబ్రిగుడ మే 21, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండల ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నిషాంతి టి., జిల్లా జాయింట్ కలెక్టర్లు తిరుమాని శ్రీ పూజ, జిల్లా రెవెన్యూ అధికారి (ఎఫ్‌ఏసీ) ఎంవీఎస్ లోకేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా మొత్తం 88 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ సమస్యలు, పట్టాదార్ పాస్ పుస్తకాలు, సరిహద్దు వివాదాలకు సంబంధించి 10 అర్జీలు నమోదు కాగా, పంచాయతీరాజ్‌, ఉపాధి హామీ, విద్యుత్‌, తాగునీరు, రహదారులు, అంగన్‌వాడీ భవనాలు, సంక్షేమ పథకాలు తదితర అంశాలకు సంబంధించిన 78 అర్జీలు వివిధ శాఖలకు అందాయి.
ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశిత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అర్జీదారులతో అధికారులు నేరుగా మాట్లాడి సమస్యను సున్నితంగా పరిశీలించాలని, సమస్య పరిష్కారం సాధ్యం కాని పరిస్థితుల్లో కారణాలను స్పష్టంగా వివరించాలని కలెక్టర్ సూచించారు. సమస్యల పరిష్కారంలో ఆలస్యం, సరైన స్పందన లేకపోవడం వల్లే పిటిషన్లు పదేపదే పునరావృతమవుతున్నాయని అధికారులు గమనించాలని పేర్కొన్నారు.
అర్జీలను గడువులోగా పరిష్కరిస్తే ఐవీఆర్ఎస్‌లో ప్రతికూల అభిప్రాయాలు రాకుండా ఉంటాయని, ప్రజలకు న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ నిషాంతి టి. స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పీజీఆర్‌ఎస్‌ నోడల్ అధికారి, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నీలకంఠరావు, జిల్లా పరిషత్ సీఈవో సత్యనారాయణ, ఐటీడీఏ ఏపీవోతో పాటు జిల్లా, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page