జూలై 16, 2026
TRINETHRAM NEWS
Kishori Vikasa summer classes begin

అరకులోయ మండలంలోని 168 అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహణ

Kishori Vikasa Summer Classes : అరకులోయ, మే 16, (త్రినేత్రంన్యూస్): కిశోర, కిషోరీ బాల బాలికల్లో ఆరోగ్య అవగాహన, వ్యక్తిత్వ వికాసం, సామాజిక బాధ్యత పెంపొందించే లక్ష్యంతో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) ఆధ్వర్యంలో “కిషోరీ వికాస” వేసవి అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా స్త్రీ–శిశు సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు.
మే 1వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు 39 రోజుల పాటు ఈ ప్రత్యేక శిక్షణ తరగతులు కొనసాగనున్నాయి. అరకులోయ మండలంలోని 168 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అరకు లోయ ఇన్‌చార్జి స్త్రీ–శిశు సంక్షేమ శాఖ అధికారిణి లక్ష్మి వెల్లడించారు.
11 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల కిశోర, కిషోరీ బాల బాలికలకు పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రత, రక్తహీనత నివారణ, బాల్య వివాహాల నివారణ, చైల్డ్ అబ్యూజ్ మరియు సంబంధిత చట్టాలు, సెల్‌ఫోన్ వినియోగం, విద్య, వైద్యం, వ్యక్తిత్వ వికాసం, జీవన నైపుణ్యాలపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు.
వేసవి సెలవుల్లో విద్యార్థులు ఎక్కువ సమయం ఇంటి వద్ద ఖాళీగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని, వారి సమయాన్ని సద్వినియోగం చేసేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉదయం వేళల్లో బాలికలకు, మధ్యాహ్న సమయంలో బాలురకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ఎదిగే వయస్సులో బాల బాలికలు మానసిక గందరగోళ పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో యువత తమ సమస్యలను ఇతరులతో పంచుకోవడంలో సంకోచిస్తారని పేర్కొన్నారు. అలాంటి వారికి ఈ వికాస తరగతులు మార్గనిర్దేశకంగా నిలుస్తాయని అధికారులు అభిప్రాయపడ్డారు.
ప్రతి అంగన్వాడీ కేంద్రంలో సుమారు 30 మంది చొప్పున మండలవ్యాప్తంగా నాలుగు నుంచి ఐదు వేల మంది కిశోర, కిషోరీ బాల బాలికలు ఈ కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ కోఆర్డినేటర్ ఆనంద్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అల్లూరి సీతారామరాజు జిల్లా స్త్రీ–శిశు సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page