ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
welfare shrimp farmers

Welfare Shrimp Farmers : గుంటూరు ,, ఎన్టీఆర్ జిల్లా : అమరావతి ; త్రినేత్రం న్యూస్ : జూలై 15 ; రాష్ట్రంలో రొయ్యల సాగు రంగంలో పారదర్శకత, శాస్త్రీయ విధానాలతో స్థిరత్వం తీసుకొస్తాం అని వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రొయ్యల ఫీడ్ ధరలు, రొయ్యల కొనుగోలు ధరలు, ఆక్వాకల్చర్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులు, ఎగుమతిదారులు, శాస్త్రవేత్తలు, సంబంధిత శాఖల అధికారులతో పెనమలూరు లోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు సంక్షేమానికే పెద్దపీట వేస్తుందని అన్నారు. రొయ్యల రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు శాశ్వత పరిష్కారాల అమలుకు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందన్నారు. ఈ లక్ష్యంతో అన్ని వర్గాల భాగస్వాములతో నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తూ, ఆచరణ సాధ్యమైన, శాస్త్రీయ ఆధారిత విధానాలను రూపొందించాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. రొయ్యల ఫీడ్ ధరల నిర్ణయంలో పూర్తి పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ముడి పదార్థాల వాస్తవ ధరలు, శాస్త్రీయ ప్రమాణాలు, నిపుణుల సిఫార్సుల ఆధారంగా ఫీడ్ ధరలను నిర్ణయించే పారదర్శక విధానాన్ని అమలు చేయాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, వాస్తవ పరిస్థితులపై రైతులకు ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందించాలని అపోహలు, తప్పుడు ప్రచారానికి తావులేకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి తెలిపారు.. రొయ్యల సాగు వ్యయాన్ని తగ్గించేందుకు అవసరమైన విధానపరమైన అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో నిరంతర సమన్వయం కొనసాగించాలని సూచించిన మంత్రి, ఫీడ్ తయారీలో కీలకమైన సోయాబీన్ మీల్ దిగుమతులు, దేశీయంగా ఫిష్ మీల్ లభ్యత పెంపు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర ప్రతిపాదనలు పంపి అవసరమైన విధానపరమైన మద్దతు పొందేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని ఆక్వాకల్చర్ రంగం ప్రపంచస్థాయిలో మరింత పోటీతత్వాన్ని సాధించాలంటే రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు, ప్రాసెసర్లు, ఎగుమతిదారులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వ యంత్రాంగం పరస్పర సహకారంతో పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. రైతుల ఆదాయం పెరగడం, ఉత్పత్తి వ్యయం తగ్గడం, ఆక్వాకల్చర్ రంగం దీర్ఘకాలికంగా స్థిరపడేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. చివరగా మంత్రి మాట్లాడుతూ, రైతు సంక్షేమం, ఆక్వాకల్చర్ రంగ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పారదర్శక విధానాలు, శాస్త్రీయ నిర్ణయాలు, అన్ని వర్గాల సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ను రొయ్యల ఉత్పత్తి, ఎగుమతుల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page