అరకులోయ జనవరి 20, (త్రినేత్రంన్యూస్): పేదలు, కూలీల జీవనాధారమైన ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే బీజేపీ,ఎన్‌డీఏ ప్రభుత్వ విధానాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అల్లూరి జిల్లా అరకు వ్యాలీ మండలంలో ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకునేందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
సోమవారం పద్మపురం పంచాయతీ దొమ్మగూడ కాలనీలో మండల కమిటీ సభ్యులు భగత్‌రామ్‌తో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, వామపక్ష పార్టీలు పోరాడి యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉపాధి హామీ చట్టాన్ని సాధించాయని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ,ఎన్‌డీఏ కూటమి ఈ చట్టాన్ని దశలవారీగా నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.
గతంలో ఉపాధి హామీ పథకానికి 90 శాతం నిధులు కేంద్రం, 10 శాతం రాష్ట్రం భరించేదని, ఇప్పుడు కేంద్రం వాటాను 60 శాతానికి తగ్గించి రాష్ట్రాలపై 40 శాతం భారం మోపేలా మార్పులు తీసుకొస్తున్నారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల భారంతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ విధానం అమలైతే పనిదినాలు తగ్గిపోవడం, కూలీలకు రావాల్సిన డబ్బులు బకాయిలుగా మిగిలిపోవడం తప్పదన్నారు. దీని ఫలితంగా భవిష్యత్తులో ఉపాధి హామీ పథకం పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
భూస్వాములు, కార్పొరేట్లకు మేలు చేసేందుకే చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్నారని విమర్శించారు. కార్మికులను బానిసలుగా మార్చేందుకు నాలుగు లేబర్ కోడ్లు తెచ్చి పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు, పేదల పొట్టను కొట్టి వారి జీవనాన్ని అస్థిరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పేదలందరూ ఐక్యంగా బీజేపీ విధానాలను త్రిప్పికొట్టి, ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించుకునేందుకు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం గ్రామ శాఖ సభ్యులు ధర్మ, బలరాం తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


