అరకులోయ డిసెంబర్ 20, (త్రినేత్రం న్యూస్): అరకులోయ మండలానికి కూతవేటు దూరంలో ఉన్న చోంపి పంచాయతీ, చోంపి గ్రామంలో నిర్మాణంలో ఉన్న రైతు భరోసా కేంద్రం భవనం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో అర్ధాంతరంగా నిలిచిపోయింది. సదరు అధికారుల నిర్వాహక లోపమో లేక గుత్తేదారుల అలసత్వమో తెలియదు గానీ, నెలల తరబడి భవన నిర్మాణ పనులు నిలిచిపోవడంతో ఈ భవనం ఆకతాయిల అడ్డాగా మారింది.
భవనానికి కిటికీలు, తలుపులు లేకపోవడంతో కొందరు దీన్ని మల విసర్జన, బహిర్భూమి అవసరాలకు వినియోగిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సేవలందించాల్సిన రైతు భరోసా కేంద్రం ఈ స్థాయిలో దుస్థితికి చేరుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
అయితే, ఈ అద్వాన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పక్కనే ఉన్న గ్రామ సచివాలయ సిబ్బంది కూడా కనీసం కన్నెత్తి చూసిన దాఖలాలు లేవని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ భవనం ఇలాంటి దురవస్థకు చేరుకుందని వారు ఆరోపిస్తున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన అడ్వకేట్ శ్రీనివాస్, రైతు భరోసా కేంద్రం రైతులకు ఎంతో కీలకమని, ఇలాంటి ప్రజాప్రయోజన భవనాల విషయంలో అధికారుల నిర్లక్ష్యం ఏమాత్రం సమంజసం కాదన్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి, గుత్తేదారునికి ఆదేశాలు జారీ చేసి కిటికీలు, తలుపులు ఏర్పాటు చేసి భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
చోంపి గ్రామ పంచాయితీ రైతులు, యువకులు కూడా ఈ సమస్యపై స్పందిస్తూ, ఇకనైనా అధికారులు కళ్లుతెరచి రైతు భరోసా కేంద్రాన్ని పునర్నిర్మించి ప్రజల ఉపయోగంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువకులు, రైతులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


