ఈనెల 17న కార్పొరేషన్ ఎదుట జరిగే ఆందోళనకు తరలిరండి.
సిపిఎం కడప నగర కార్యదర్శి రామమోహన్
Trinethram News : కడప నగర పాలక సంస్థ ఏర్పడి 20 సంవత్సరాలు దాటినా నేటికీ మౌలిక సమస్యలు పరిష్కరించడంలో కార్పొరేషన్ యంత్రాంగం ఘోరంగా విఫలమైందని సిపిఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ తీవ్రంగా విమర్శించారు. గురువారం నాడు కడప నగరంలోని రామకృష్ణ నగర్ లో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సిపిఎం నేతలు పర్యటన నిర్వహించారు.
ఈ సందర్భంగా రామమోహన్ మాట్లాడుతూ .. రామకృష్ణ నగర్ లో దాదాపు 2వేల కుటుంబాలు నివాసం ఉంటున్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రధాన రోడ్లు మినహా వీధుల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. వర్షం వస్తే ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.
మురిగినీరు రోడ్డు మీద పేరుకుపోవడం వల్ల వివిధ రకాల జబ్బులు వస్తున్నాయని పిల్లలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వీటితో పాటు విషపురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. దోమలు విపరీతంగా ఉన్నాయని, వాటి నియంత్రణ కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గతంలో నగర పాలక సంస్థ కమిషనర్ పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు కడప కార్పొరేషన్ లో జరిగే ఆందోళనలో ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో సిపిఎం నగర కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, కామేశ్వరమ్మ, నరసింహ, శేఖర్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


