ఎమ్మెల్యే తప్పుదారి పట్టించారు
ఎమ్మెల్సీ తోట ప్రజలకు స్పష్టత ఇచ్చారు.
వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించం
త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 3: మండపేట నియోజకవర్గం రెవెన్యూ, పాలనా వ్యవస్థలను రాజమహేంద్రవరం డివిజన్‌లోకి విలీనం చేసిన వ్యవహారంలో ఎమ్మెల్సీ తోట ప్రజలకు స్పష్టత ఇచ్చారని, దానిపై ఎమ్మెల్యే వేగుళ్ళకు ఉలుకెందుకని వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఎద్దేవా చేశారు. అంగరలోని పార్టీ మండల కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు మాట్లాడుతూ మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం డివిజన్‌లో విలీనం చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, ఇతర అధికార పార్టీ నేతలు వ్యవహార శైలి విడ్డూరంగా ఉందన్నారు. విలీనం ఎమ్మెల్యే వల్ల మాత్రమే అయ్యిందంటూ పాలాభిషేకాలు చేస్తున్న అధికార పార్టీ నేతలకు వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు తీర్మాణాలు చేసి ఇచ్చిన సంగతి గుర్తుకు రావడంలేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును పదే పదే స్థానికేతరుడన్న భావనలో ఎమ్మెల్యే అనుచరులు ప్రచారం చేయడం సరికాదన్నారు.
సీఎం చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పంలోనూ పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి పిఠాపురంలోనూ, లోకేష్ హైదరాబాద్ నుంచి మంగళగిరిలోనూ, మంత్రి వాసంశెట్టి సుభాష్ అమలాపురం నుంచి రామచంద్రపురంలోనూ పోటీ చేసిన విషయాన్ని గుర్తించాలన్నారు. ఎమ్మెల్సీ తోటను విమర్శించే వారు ముందస్తుగా వారి వారి రాజకీయ ప్రస్తావనలను గుర్తు చేసుకోవాలన్నారు. ఎంపీపీ సాకా శ్రీనివాస్ మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ మార్పు ఎమ్మెల్యే వేగుళ్ళ ఘనత అంటూ సంబరాలు చేయడం హాస్యాస్పదం అన్నారు. అమలాపురం డివిజన్‌కు దగ్గర్లో ఉన్న అద్దంకివారిలంక, కొత్తపేట డివిజన్‌కు దగ్గర్లో ఉన్న కేదారిలంక గ్రామాల్లో ఏమని సంబరాలు చేసుకోమంటారో ఎమ్మెల్యే వేగుళ్ళ చెప్పాలన్నారు. రాజమండ్రికి మండపేట నియోజకవర్గం దగ్గర అని అంటున్న అధికార పార్టీ నేతలు లంక గ్రామాలను పరిగణనలోకి తీసుకోరా అని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు గూటం సత్యనారాయణ మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ మార్పు విషయమై వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు చర్చించారన్నారు. ఎమ్మెల్సీ తోట ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచారని, ఆయన పనితీరును మండపేట నియోజకవర్గం అభివృద్ధిని చూసి తెలుసుకోవచ్చన్నారు. మాజీ ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి మాట్లాడుతూ కపిలేశ్వరపురం మండల పరిషత్ వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధుల పాలనలో ఉందని, పరిషత్‌లో వారి సహకారం లేకుండా విలీనానికి అనుకూలంగా తీర్మాణం దక్కేదా అని ప్రశ్నిస్తూ వైఎస్సార్‌సీపీ సభ్యులు పెట్టిన సంతకాలతో కూడిన తీర్మాణం పత్రాన్ని చూపించారు. ఎమ్మెల్సీ తోట ప్రజల పక్షాన మాట్లాడతారని, వ్యక్తిగత విమర్శలు చేసిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే వేగుళ్ళ గుర్తించాలన్నారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు నక్కా సింహాచలం మాట్లాడుతూ మండపేట నియోజకవర్గాన్ని అనేక మంది ఎమ్మెల్యేలు వారి వారి పాలనాకాలంలో అభివృద్ధి చేశారని, ఐదేళ్ళలో ఎమ్మెల్సీ తోట చేసిన అభివృద్ధిని వేగుళ్ళను కీర్తించే వారు చూడాలన్నారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ నాయకుడు పిప్పర సంపతరావు మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్‌ను మార్చిన దానికి ఎమ్మెల్యే వేగుళ్ళ ఘనత అంటూ కృత్రిమ సంబరాలు చేస్తున్నారన్నారు. జేఏసీ నాయకుడు పేరుతో ధూళి జయరాజు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును విమర్శించడం సరికాదన్నారు.
పార్టీ సీనియర్ నాయకుడు సలాది వీరబాబు మాట్లాడుతూ రామచంద్రపురం డివిజన్ నుంచి రాజమహేంద్రవరం డివిజన్‌లోకి విలీనం చేయడం గొప్పని తాను అనుకోవడంలేదన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ళ మండపేటకు రెవెన్యూ డివిజన్‌ను సాధించగలిగితే హర్షిస్తానన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ విప్ పలివెల మధు, ఎంపీటీసీ మేడిశెట్టి దుర్గారావు, ఉప సర్పంచ్ బొక్కా రాంబాబు, నాయకులు ఉమ్మిడిశెట్టి సూరిబాబు, ప్రగడ అర్జునరావు, కందుకూరి సత్యం, మేడిశెట్టి దుర్గారావు, చీకట్ల సుబ్బారావు, సుంకర వీరబాబు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


