అల్లూరిజిల్లా, అరకు వ్యాలీ – త్రినేత్రం న్యూస్, జూన్ 14: అరకువ్యాలీ మండలానికి చెందిన సిరగం పంచాయతీలో గల గిరి గ్రామాలకు కలిపే ప్రధాన రహదారి పూర్తి రీతిలో ధ్వంసమై ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్య ప్రయాణాలకే కాక, అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ రహదారి అనర్హత కారణంగా అనేక సమస్యలు ఎదురవుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ రహదారి పరిస్థితి గత కొంతకాలంగా దయనీయంగా మారిందనీ, సంబంధిత అధికారులు ఎన్నిసార్లు దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి స్పందన రాకపోవడం బాధాకరమని తెలిపారు. “ప్రజాప్రతినిధులు, స్థానిక సర్పంచ్ లు ప్రజల కష్టాలను పట్టించుకోక మొద్దుబారిపోయారు” అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తున్న వారు, ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రం తమ హామీలను మర్చిపోతున్నారని మండిపడ్డారు. “ఇప్పటికే అంబులెన్స్ వాహనం రావడానికి కూడ రహదారి అనర్హత తీవ్రమైన ఆటంకంగా మారింది. ప్రాణాపాయ పరిస్థితుల్లో మేము ఎంతో కష్టపడాల్సి వస్తోంది” అని గ్రామస్తులు వేదనతో తెలిపారు.
ఈ నేపథ్యంలో, రహదారి పునరుద్ధరణ పనులను తక్షణమే చేపట్టాలని, ప్రజల జీవితాలతో ప్రభుత్వం తలాడకుండా చూడాలని ఎస్ఎఫ్ఐ మండల నాయకులు ఎస్. ఐ. సుబాబు డిమాండ్ చేశారు. “ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో శ్రద్ధ వహించాలి. రహదారిని మరమ్మతు చేయకపోతే తీవ్రమైన ప్రజా ఉద్యమానికి తెరతీసే అవకాశం ఉంది” అని ఆయన హెచ్చరించారు.
ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న ఈ రహదారి సమస్యపై అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


