ఆలస్యమైతే కాంగ్రెస్‌కు మరింత నష్టం!
ఉన్నతాధికారులతో సీఎం భేటీ
ఎన్నికల నిర్వహణపై సమాలోచన
సన్నబియ్యం, రేషన్‌కార్డులు, రాజీవ్ యువవికాసంపైనే ఆశలు
ఆలస్యమైతే ఇంకా నష్టమనే భయం
Trinethram News : హైదరాబాద్, మే 25 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వ పెద్దలు కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం.
సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత జూన్ 5లోగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ (ఎస్‌ఈసీ) నుంచి ఈ మే రకు ప్రకటన రావచ్చని పేర్కొన్నాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్) కమిషనర్ సృజన, ఇతర ఉన్నతాధికారులతో తాజాగా సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.
పంచాయతీ ఎన్నికలు జరపాలని ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి వస్తున్నదని సీఎం తెలుపగా, ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసి ఉంచామని అధికారులు చెప్పినట్టు సమాచారం. బ్యాలెట్ పేపర్లు సైతం ముద్రించి సిద్ధంగా ఉంచామని చెప్పినట్టు తెలిసింది. సీఎంతో భేటీ అనంతరం తొలిసారిగా కమిషనర్ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఇతర ముఖ్య అధికారులతో మాట్లాడినట్టు అధికారవర్గాలు సైతం వెల్లడించాయి. ఏ సమయంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడవచ్చని, సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపాయి.
ఆలస్యమైతే మరింత నష్టం
రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగిసి ఏడాది దాటిపోయింది. కేంద్రం, 15వ ఫైనాన్స్ నిధులు రాక గ్రామాల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన నిలిచింది. పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి 15 నెలలు దాటింది. అయినా, ఎన్నికలు నిర్వహించకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్రామీణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇంకా ఆలస్యమైతే మరింత నష్టం జరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వ పెద్దలకు ఫీడ్‌బ్యాక్ అందింది. ఫలితాలు ఎలా వచ్చినా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వ పెద్దల వద్ద మొరపెట్టుకుంటున్నారు.
పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు తమ సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్తారని, తమపై కాస్త ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. వెంటనే ఎన్నికలకు వెళ్లాలని కొందరు ఎమ్మెల్యేలు ఒత్తిడి కూడా తీసుకొస్తున్నట్టు తెలిసింది. సన్నబియ్యం, రేషన్‌కార్డుల పంపిణీ, యువవికాసం వంటి పథకాల అమలు అంశం కలిసి వస్తుందని కూడా హస్తం నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆ పథకాలపై ఇంటింటా ప్రచారం చేయాలని ఎమ్మెల్యేలకు సీఎం, డిప్యూటీ సీఎం పలు సూచనలు ఇచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


