APCR Report : ముస్లింలపై 184 విద్వేష దాడులు

TRINETHRAM NEWS

ఎపిసిఆర్‌ నివేదిక వెల్లడి..!

Trinethram News : న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి అనంతరం దేశంలో ముస్లింలు.. సంఘ పరివారానికి టార్గెట్‌గా మారారు. వారిని లక్ష్యంగా చేసుకుంటూ దాడులు, బెదిరింపులు పెరిగిపోయాయి. ఏప్రిల్‌ 11 నుంచి మే 8 వరకు భారత్‌లో మొత్తం 180కి పైగా ముస్లిం వ్యతిరేక ద్వేషపూరిత సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలలో 300 మందికి పైగా ప్రజలు భౌతికంగా, మానసికంగా ప్రభావితమయ్యారు. యుపి నుంచే ఎక్కువ ఘటనలు నమోదు కావటం ఆందోళనకరం. అసోసియేషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ రైట్స్‌ (ఎపిసిఆర్‌) నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం.. ముస్లింలే టార్గెట్‌గా 184 ద్వేషపూరిత ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇందులో పహల్గాం ఉగ్రదాడి తర్వాత 106 ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో 316 మంది శారీరకంగా, మానసికంగా గాయాలను అనుభవించారు. ఈ దాడులు యాదృచ్ఛికంగా జరగలేదు. ఈ ఘటనలు అత్యధికంగా యుపి నుంచి 43 నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లోనూ బిజెపి పాలిత రాష్ట్రాలే అయిన మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌ ఉన్నాయి.

యుపిలో స్కూల్‌ విద్యార్థిపై దాడి
యోగి పరిపాలిస్తున్న యుపిలో అయితే కఠిన పరిస్థితులే ఉన్నాయి. బిజెపి పరివారం తీవ్రంగా రెచ్చిపోయింది. 15 ఏళ్ల ముస్లిం బాలుడు స్కూల్‌ నుంచి తిరిగి వస్తున్న సమయంలో హిందూత్వ మూక ఆయనపై దాడి చేసింది. ఆ బాలుడి చేత పాకిస్తాన్‌ జెండాపై బలవంతంగా మూత్ర విసర్జన చేయించింది. అలీఘర్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నది.

మధ్యప్రదేశ్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌పై..
మధ్యప్రదేశ్‌ కూడా ఇందుకు ఏ మాత్రమూ తీసిపోలేదు. ఏకంగా ముస్లిం మతానికి చెందిన ఒక పోలీసు పైనే దాడికి దిగిన ఘటన భోపాల్‌లో గతనెల 26న నమోదైంది. మద్యం మత్తులో ఉన్న హిందూత్వ కార్యకర్తలు రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ నాజర్‌ దౌలత్‌పై దారుణంగా దాడి చేశారు. హిందూత్వ కార్యకర్తలు రైల్వే స్టేషన్‌ ఆవరణలో ఒక కారులో తెల్లవారు జామున మద్యం సేవిస్తుండటాన్ని గమనించిన హెడ్‌ కానిస్టేబుల్‌.. వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. హెడ్‌ కానిస్టేబుల్‌ పేరు చివరన ‘ఖాన్‌’ అనే ముస్లిం పేరును గమనించిన హిందూత్వ కార్యకర్తలు ఈ దారుణానికి దిగారు.

విద్యార్థులను బహిష్కరించాలని అల్టిమేటం
చండీగఢ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలోని హాస్టళ్లలో కూడా కాశ్మీరీ ముస్లిం విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు జరిగాయి. డెహ్రాడూన్‌లో అయితే హిందూత్వ కార్యకర్తలు.. కాశ్మీరీ విద్యార్థులను బహిష్కరించాలంటూ అల్టిమేటం జారీ చేయటం గమనార్హం. అంతేకాదు.. పలు కాలేజీలకు లిఖితపూర్వక బెదిరింపులను కూడా పంపినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక కాశ్మీర్‌ నుంచి వచ్చి వ్యాపారం చేసుకునే ముస్లింలను టార్గెట్‌ చేసుకుంటూ జరిగిన దాడులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ముస్సోరీలో ఇద్దరు కాశ్మీరీ శాలువా విక్రేతలపై బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు దాడికి దిగారు. కాశ్మీరీ శాలువా విక్రేతల బృందాన్ని రాత్రిపూట ఖాళీ చేయాలని కూడా ఆదేశించటంతో వారు రూ.12 లక్షల విలువైన సరుకు వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది.

రెచ్చిపోయిన బిజెపి ఎమ్మెల్యే
రాజస్తాన్‌లో అధికార బిజెపి ఎమ్మెల్యే అయితే తన బాధ్యతను మరిచి ప్రవర్తించాడు. బాల్‌ముకుంద్‌ ఆచార్య ఒక ర్యాలీలో మసీదును ధ్వంసం చేశారు. ఉత్తరాఖండ్‌లో హిందూత్వ శక్తులు మసీదుపై రాళ్లతో దాడి చేశాయి. ఇక సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ మరీ కాశ్మీర్‌లో అనుమానిత ఉగ్రవాదుల ఇళ్లను అధికార యంత్రాగాలు కూల్చి వేయటం ఆందోళనకరం. దేశవ్యాప్తంగా హిందూత్వ శక్తుల దాడులతో ముస్లిం సమాజం భయాందోళనలో జీవిస్తున్నది. రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు మాత్రం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయని మైనారిటీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

184 hate attacks on Muslims

You cannot copy content of this page

Scroll to Top