నరికేసి తీసుకెళ్లాల్సిందే…
ఆశ్చర్యపరుస్తున్న అడవీశాఖ చట్టాలు
త్రినేత్రం న్యూస్. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి.. అలాగే చెట్లను కాపాడాలి.. అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రసారం చేస్తున్నాయి. ఆ ప్రచారానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. కాని అటవీశాఖలో ఉన్న కొన్ని చట్టాలు ఆ ప్రచారాన్ని వెక్కిరిస్తున్నాయి. చెట్లను నరికేయాలి తప్ప సజీవంగా తీసుకెళ్లకూడదని ఆ శాఖ అధికారులు హెచ్చరించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
వివరాల్లోకెళ్తే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి కూరగాయల మార్కెట్ నుంచి చొప్పెల్ల లాకుల వరకు 3.1 కిలోమీటర్ల వరకు నాలుగులైన్ల జాతీయ రహదారిని అనుకుని సర్వీస్ రోడ్ నిర్మిస్తున్నారు. ఈ సర్వీస్ రోడ్‌లో గల 96 చెట్లు తొలగించడానికి అటవీ శాఖ అధికారులను నేషనల్ అధికారులు అనుమతులు కోరారు. దీనిపై ఆ చెట్లు రకం, వయసును బట్టి అటవీ శాఖ అధికారులు ధరలు నిర్ణయించి అనుమతులు ఇచ్చారు. ఆ ప్రకారం నేషనల్ హైవే అధికారులు వేలం పాటు నిర్వహించి ఈ చెట్లు తొలగింపుకు చర్యలు చేపట్టారు. ఈ చెట్లలో కొన్ని పురాతన వృక్షాలు కూడా ఉన్నాయి. దశాబ్దాలు నాటి రావి,వేప,గానుగ వంటి చెట్లను పూర్తిగా నరికేసి దుంగలను మాత్రమే తీసుకెళ్లాలని ఆదేశాలిచ్చారు.
చెట్లను సజీవంగా తీసుకెళ్లడమంటే…
ఎవరైనా చెట్లను తొలగించే తీసుకెళ్తారు కదా అనుకోవచ్చు. నిజమే కాని ఇటీవల ఈ పురాతన చెట్లకు దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకనే తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు ఇలాంటి తొలగించాల్సిన చెట్లను ప్రత్యేక యంత్రాలు సాయంతో సజీవంగా తొలగించి నర్సరీలకు తరలించి మళ్ళీ వాటికి పునర్జీవం పోస్తున్నారు. ఇది చాలా ఆమోదయోగమైనది కూడా. కాని వాల్టా చట్ట ప్రకారం ఇలా చెట్లను సజీవంగా తొలగించడానికి అవకాశం లేదని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అనుమతి ఇచ్చిన చెట్లన్నీ నరికే తీసుకెళ్లాలి తప్ప సజీవంగా తీసుకెళ్లకూడదని చెప్పడంతో అందరూ ఈ చట్టాల తీరును తప్పుపడుతున్నారు. పాతబడిన చట్టాలను మార్పు చేయాలంటున్నారు.
కన్నీరు పెట్టిస్తున్న చెట్టు నరికివేత
దశాబ్దాల కాలంగా ఎందరికో నీడనిచ్చాయి… ఎంతో ఆక్సిజన్ పంచాయి. అలాంటి చెట్లను తొలగించ వలసి రావడం బాధాకరమే.కళ్ళ ఎదుటే ఆ చెట్లు మాయమై పోతుండటం లంక గ్రామాల ప్రజలను కంటతడి పెట్టేస్తున్నాయి. ఎందుకంటే ఈ చెట్లు స్థానికులకే గాక జాతీయ రహదారిలో ప్రయాణించే వాహనదారులు సేద తీరడానికి ఎంతో దోహదపడ్డాయి. అలాంటి చెట్లను ఒక్కొక్కటిగా తొలగించి దుంగలను లారీలో తరలించుకు పోతుంటే స్థానికుల ఆవేదన మాటల్లో చెప్పలేము.
అలాంటి చెట్లను తాము బతికిస్తామని నర్సరీలు ముందుకు వస్తుంటే చట్టాలు ఒప్పుకోక పోవడం అత్యంత బాధాకరం.అసలు ఇలాంటి చెట్లను తొలగించాల్సి వస్తే ఎవరైనా సజీవంగా తీసుకెళ్ళి పునర్జీవం ఇవ్వడానికి ప్రభుత్వమే ప్రోత్సహించాలి. అంతేగాని ఇలా నిబంధనలు పేరుతో పురాతన చెట్లకు శాశ్వతంగా జీవం లేకుండా చేస్తే ఎలా అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. ఇలా చెట్టు తరలించుకు పోవడానికి అనుమతులు ఇస్తే కొందరు నర్సరీ వ్యాపారులు దొంగ చాటుగా చెట్లు మాయం చేసి అమ్మేసుకుంటున్నారని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. దానిని కాదనలేము. అలాంటి వాటిని అడ్డుకోవడం తప్పులేదు. కాని ప్రభుత్వం తొలగించడానికి అనుమతులు ఇచ్చిన వాటిని సజీవంగా తీసుకెళ్లడానికి వీలు లేదంటే మాత్రం సమంజసం కాదనే చెప్పాలి.అటవీ శాఖ అధికారులు ఈ చెట్లను సజీవంగా తీసుకెళ్లడానికి అనుమతులు ఇవ్వాల్సిన ఎంతైనా ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


