అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్,జూన్ 10: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అక్రమంగా తొలగించబడిన ఐదువేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అరకులో నాలుగు రోడ్లు సెంటర్లో సోమవారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, ప్లాంట్‌కు సొంత గనులు ఏర్పాటు చేయాలని కోరుతూ కార్మికులు విస్తృతంగా ఉద్యమిస్తున్నారని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమానికి విశాలమైన మద్దతు లభిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నేతలు స్టీల్ ప్లాంట్‌ను రక్షిస్తామని, ప్రైవేటీకరణను అంగీకరించమని ఉద్యమ శిబిరాల్లో హామీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఆ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మౌనం పాటించడం బాధాకరమన్నారు. వీరంతా బీజేపీకి దాసోహంగా మారిపోయారని విమర్శించారు.
కార్మికుల పోరాటం మరింత ఉదృతంగా సాగనున్నదని, ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. “కార్మికుల కన్నీళ్లు పాలకులకు శాపంగా మారతాయి” అని వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతామని నమ్మి ఓటు వేసిన ఐదువేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ప్రస్తుతం రోడ్డున పడ్డారని, వారికి తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విశాఖపట్నంలో చేపట్టిన దీక్షా శిబిరాలను పోలీసులు అక్రమంగా ఖాళీ చేయించిన ఘటనను ఆయన ఖండించారు. శాంతియుతంగా సాగుతున్న ఉద్యమానికి ఆటంకం కలిగించకుండా, దీక్షా శిబిరాలను వెంటనే తిరిగి అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు కొండబాబు, దున్ను, కోగేశ్వరరావు, ఐకెపి, ఆటో కార్మికులు, గిరిజన సంఘం నాయకులు రామారావు, రామన్న తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


