MLA Vegulla : అనవసర ఖర్చులు తగ్గించాలి

TRINETHRAM NEWS

ప్రజాధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయాలి…

పురపాలక సంఘ ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించాలి…

కౌన్సిల్ అజెండాలో పలు అంశాలకు సవరణలు చేసిన ఎమ్మెల్యే వేగుళ్ళ

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట మున్సిపాలిటీ అనవసర ఖర్చులు తగ్గించుకోవడంతో పాటూ ఆదాయం పెంచే అంశాలపై దృష్టి సారించాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. సోమవారం మండపేట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశం లో ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ 90 లక్షలు వెచ్చించి రోడ్లు ఊడ్చే యంత్రం కొనుగోలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మిషన్ కొనుగోలు చేయడం ద్వారా పని చేసే కార్మికుల సంఖ్య తగ్గుతుందా అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయాలని సూచించారు.

అలాగే కాంటిలివర్ (అడ్వర్టైజ్ మెంట్) బోర్డు లు ఏర్పాటు కు అనుమతులు కోరుతూ ఓ ప్రయివేటు సంస్థ చేసుకున్న దరఖాస్తు అంశాన్ని కౌన్సిల్ కి తీసుకురాగా ఎమ్మెల్యే వేగుళ్ళ దానిని తిరస్కరించారు. ఒక్కరికే కాంట్రాక్ట్ మనం ఎందుకు ఇవ్వాలని, ఇలాంటి సంస్థలు ఎన్ని ఉన్నాయో వారందరికీ సమాచారం ఇచ్చి టెండర్ లు పిలిస్తే మున్సిపాలిటీ కి ఎక్కువ ఆదాయం వస్తుందని తెలిపారు. ఆ అంశాన్ని వాయిదా వేయాలని కమీషనర్ కోరినా ఎమ్మెల్యే తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.

బురుగుంట చెరువు వాటర్ ట్యాంక్ పనులు నత్త నడకన సాగడంపై ఎమ్మెల్యే వేగుళ్ళ ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్ లో అన్ని రాసారు గానీ కాల పరిమితి రాయలేదని ఇంజనీరింగ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఇది ఊరు సమస్య అని, దీనిపై నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. దీనిపై కాంట్రాక్టర్ ను పిలిచి మాట్లాడితే కాలపరిమితి లేని కారణంగా కట్టుకుంటూ పోతానని తెలివిగా సమాధానం చెప్పాడని చెప్పారు. అందుకు తాను మేము కూడా నెలకు 100 రూపాయలు బిల్లు ఇచ్చుకుంటూ పోతామని ఝులక్ ఇవ్వడంతో దారిలోకి వచ్చాడన్నారు. అయితే అధికారులు అతనితో అధికారికంగా ఎన్ని రోజుల్లో పూర్తి చేసి ఇస్తారో లిఖితపూర్వకంగా రాసి పెట్టుకోవాలన్నారు. వాటర్ ట్యాంక్ మరమ్మత్తు పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అలాగే ఒక ట్యాంక్ వుండగానే మరో ట్యాంక్ నిర్మించుకోవాలని ఇందుకు అవసరమైన నిధులు తాను రాష్ట్ర ప్రభుత్వం నుండి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు.

ఏడిద రోడ్డు లో బాత్ రూం ల సంగతి చర్చకు వచ్చినప్పడు వాటిని నిర్మించేందుకు ఇద్దరు దాతలు ముందుకు రావడంతో లాటరీ వేద్దామని అనుకున్నామని, అయితే అందుకు దాతలు ముందుకు రావడం లేదని కమీషనర్ సమాధానమిచ్చారు. అయితే గత కౌన్సిల్ లో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు చైర్మన్ రాణి సూచనలు మేరకు దాత పేరును ఎంపిక చేయాలని తీర్మానించడం జరిగిందని, ఇక ఈ లాటరీల గొడవ ఎందుకని ఎమ్మెల్యే ప్రశ్నించారు. 6వ వార్డులో మరో టాయిలెట్ నిర్మాణం నిర్మించాల్సి ఉన్న నేపథ్యంలో దానిని మరో దాతకు అప్పగించాలని ఎమ్మెల్యే సూచించారు.

పట్టణం లో పలు గోడలకు రంగులు వేసి సుందరీకరణ చేయాలన్న అంశం చర్చకు వచ్చినప్పుడు మండపేట కు అటూ ఇటూ వున్న స్వాగత ద్వారాలను ఎందుకు ఆధునీకరించడం లేదని కౌన్సిలర్ చుండ్రు చిన సుబ్బారావు చౌదరి ప్రశ్నించారు. అలాగే ఆధార్ నమోదు సందర్భంగా మండపేట ఆంధ్రాబ్యాంక్ నిర్వాహకులు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని చిన సుబ్బారావు చౌదరి కోరారు. దీనిపై ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లాలని సూచించారు. అదే విధంగా ఇక్కడ మరో సమస్య కూడా ఉందని, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రెండు చోట్ల, పోస్టాఫీస్, ఆంధ్రాబ్యాంక్ ల వద్ద ఆధార్ నమోదు కేంద్రాలు ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం ఒక్క ఆంధ్రాబ్యాంక్ కు మాత్రమే వెళుతున్నారని, ఈ విషయంలో వారికి అవగాహన కల్పించాలన్నారు. దీనికి కమీషనర్ స్పందిస్తూ ప్లెక్సీ లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

కాగా మున్సిపల్ మార్కెట్ వద్ద పింక్ టాయిలెట్ నిర్మాణానికి కౌన్సిల్ ఆమోదించడంపై కౌన్సిలర్ కాళ్ళకూరి స్వరాజ్య భవాని హర్షం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా ఈ సమస్యపై పోరాడుతున్నానని, ఇన్నాళ్లకు ఎమ్మెల్యే వేగుళ్ళ చొరవ ద్వారా పరిష్కారం కావడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Unnecessary expenses should be reduced

You cannot copy content of this page

Scroll to Top