
Collector Dinesh Kumar Orders : అల్లూరి సీతారామరాజు జిల్లా, మార్చి 25, (త్రినేత్రం న్యూస్): అల్లూరి జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్డు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
బుధవారం ఉదయం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ నుండి ట్రైబల్ వెల్ఫేర్, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లతో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్దార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అనుమతి పొందిన రోడ్డు పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 30 పనుల్లో 22 పనులకు అనుమతులు లభించగా, వాటిలో 10 పనులు పూర్తయ్యాయని, మరో 10 పనులు రిజర్వ్ ఫారెస్ట్ అనుమతుల కోసం పెండింగ్‌లో ఉన్నాయని, 7 పనులు ప్రగతిలో ఉన్నాయని, 3 పనులు అనుమతుల దశలో ఉన్నాయని పిఐయు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. రవికుమార్ వివరించారు. అందులో ఒకటి వంతెన నిర్మాణానికి సంబంధించినదని తెలిపారు.
ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ పనులపై కూడా సమీక్ష నిర్వహించిన కలెక్టర్, పెదబయలు మండలం జామికూడలో బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయని, అవసరమైతే ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల ద్వారా పనులు పూర్తి చేయాలని సూచించారు. డుంబ్రిగూడ మండలం శీలం గొంది వంతెన పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు అరకు ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ కే. వేణుగోపాల్ తెలిపారు.
ప్రస్తుతం ప్రగతిలో ఉన్న 7 పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని, ఇప్పటికే అనుమతులు పొందిన పనులను ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. కొండ ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు కనెక్టివిటీ కల్పించే రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, దీంతో ప్రజలకు రవాణా ఇబ్బందులు తొలగుతాయని పేర్కొన్నారు.
రోడ్లు, వంతెనల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాల్లో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేసిన కలెక్టర్, క్షేత్రస్థాయిలో సూపర్వైజర్లు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ, అటవీ శాఖ అనుమతుల వంటి సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో పాడేరు పిఐయు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. రవికుమార్, జీకే వీధి పిఐయు ఈఈ కళ్యాణ్ కుమార్, అరకు ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ కే. వేణుగోపాల్, పాడేరు ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ డేవిడ్ రాజు, జిల్లా పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి విభాగాల ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

