Araku Valley News : గర్భస్థ పిండ లింగ నిర్ధారణపై కఠిన చర్యలు
మాతృ మరణాలను సహించబోమన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
అరకులోయ ఫిబ్రవరి 12, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ వంటి అక్రమ కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, మాతృ మరణాలు జరిగితే ఏమాత్రం సహించబోమని అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. డి. కృష్ణమూర్తి నాయక్ హెచ్చరించారు.
జిల్లా ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమని శ్రీ పూజ ఆదేశాల మేరకు పాడేరు డీఎం హెచ్ఓ కార్యాలయంలో సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ మరియు సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించబడిందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా డా. కృష్ణమూర్తి నాయక్ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న అన్ని స్కానింగ్ కేంద్రాలను ప్రతి రెండు నెలలకు ఒకసారి తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆదేశించారు. పీఎంఎస్ఎంఎ (ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్) కార్యక్రమం సందర్భంగా భీమవరం, లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రేడియాలజిస్టులు, ప్రసూతి వైద్య నిపుణులను నియమించి గర్భస్థ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించే కేంద్రాలను గుర్తించేందుకు డెకాయ్ ఆపరేషన్స్ (రహస్య తనిఖీలు) నిరంతరం చేపట్టాలని సంబంధిత వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ “గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం” అనే అంశంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
అవగాహన మరియు పర్యవేక్షణలో MANSI, అమెరికన్ ఇండియా ఫౌండేషన్ (ఏఐఎఫ్) వంటి స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని స్టాండ్ అలోన్ స్కానింగ్ కేంద్రాలు మరియు ముంచింగిపుట్టు సీఎచ్‌సీ తప్పనిసరిగా వెబ్ పోర్టల్‌లో ఫారం– ఎఫ్ ను ఆలస్యం లేకుండా అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు.
అవివాహిత మహిళలు మరియు ప్రమాదకర స్థితిలో ఉన్న వర్గాలకు తగిన కౌన్సెలింగ్ అందించాలని, అన్ని ఆసుపత్రుల్లో “ఉయ్యాల కార్యక్రమం” అమలు చేయాలని ఆదేశించారు. ఉయ్యాల కార్యక్రమం కింద ఆడపిల్లలను రక్షించి, పోషించే కుటుంబాలకు ప్రోత్సాహక బహుమతుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.
అవాంఛిత గర్భాలను నివారించేందుకు కుటుంబ నియంత్రణ సేవలను మరింత బలోపేతం చేయాలని, ఫారం– ఎఫ్, ను అప్‌లోడ్ చేసే ముందు గర్భిణీ స్త్రీతో పాటు డాక్టర్ ఇద్దరూ తప్పనిసరిగా సంతకం చేయాలని తెలిపారు. అరకు ఏరియా ఆసుపత్రి నుంచి ప్రతి నెల ఒక (ఓబిజి) నిపుణుడు మరియు రేడియాలజిస్టును ముంచింగిపుట్టు సీఎచ్‌సీకి పంపించాలని ఆదేశించారు. అధికారులు స్కానింగ్ కేంద్రాలను సందర్శించినప్పుడు అక్కడ ఉన్న రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు.
సమావేశంలో పాల్గొన్నవారు
ఈ సమావేశంలో
డా. డి. కృష్ణమూర్తి నాయక్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి,
డా. టి.ఎన్. ప్రతాప్ చైర్మన్, అప్రోప్రియేట్ అథారిటీ,
డా. శ్రీలత డిప్యూటీ సివిల్ సర్జన్ (ఓబిజి)
డా. టి. నరసింగరావు హెచ్‌ఓడీ (ఓబిజి) ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, పాడేరు,
డా. పి. సృజన అసోసియేట్ ప్రొఫెసర్ (ఓబిజి)
జి. శ్రీనివాసరావు, (ఎంఈఎల్) (ఏఐఎఫ్) ఎన్జీఓ,
పి. సింహాచలం డిప్యూటీ డెమో,
జి. భూలోకమ్మ డీపీఎచ్‌ఎన్‌ఓ,
జె. కైలాసరావు జిల్లా సర్వైలెన్స్ ఆఫీసర్,
గుల్లేలి సింహాద్రి ఆరోగ్య విస్తరణ అధికారి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

