Bail of AP Liquor Scam Accused : ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల బెయిల్ పై హైకోర్టుకు సిట్

TRINETHRAM NEWS

ఏపీ లిక్కర్ స్కాంలో నిందితుల బెయిల్‌ను సవాలు చేసిన సిట్

ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్

డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడం చట్టవిరుద్ధమన్న సిట్ తరఫు న్యాయవాది

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్‌లకు ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) హైకోర్టును ఆశ్రయించింది. సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో వాడీవేడిగా వాదనలు జరిగాయి.

సిట్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. నిందితులకు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడం చట్టవిరుద్ధమని ఆయన వాదించారు. ఆగస్టు 11నే తాము అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసి, అందులో ఈ నలుగురు నిందితుల పాత్రను స్పష్టంగా వివరించామని కోర్టు దృష్టికి తెచ్చారు. ఛార్జిషీట్‌లోని అభ్యంతరాలను సెప్టెంబర్ 1లోపే సరిదిద్దామని, అయినా వాటిని పరిగణనలోకి తీసుకోకుండా బెయిల్ ఇచ్చారని తెలిపారు. ఆగస్టు 18న నిందితుల్లో ఒకరైన బాలాజీ గోవిందప్ప రెగ్యులర్ బెయిల్‌ను తిరస్కరించిన కోర్టు, కేవలం కొద్ది రోజులకే సెప్టెంబర్ 5న డిఫాల్ట్ బెయిల్ ఎలా మంజూరు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. అందువల్ల నలుగురి బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయాలని గట్టిగా వాదించారు.

నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి బదులిస్తూ.. రెగ్యులర్ బెయిల్ ఆదేశాలకు, డిఫాల్ట్ బెయిల్ ఆదేశాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అప్పటి పరిస్థితులు, సాక్ష్యాధారాల ఆధారంగా రెగ్యులర్ బెయిల్‌పై నిర్ణయం తీసుకుంటారని, ఆ తర్వాత ఇచ్చే డిఫాల్ట్ బెయిల్‌పై దాని ప్రభావం ఉండదని వివరించారు. చట్టప్రకారం 90 రోజుల తర్వాత డిఫాల్ట్ బెయిల్ పొందే హక్కు నిందితులకు ఉంటుందని ఆయన కోర్టుకు తెలిపారు.

ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం, తమ వాదనలను లిఖితపూర్వకంగా శుక్రవారంలోగా సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

bail of AP liquor scam accused

You cannot copy content of this page

Scroll to Top