Minister Seethakka : ప్రతి మహిళా సంఘం సభ్యురాలికి రూ. 10 లక్షల ప్ర‌మాద బీమా

TRINETHRAM NEWS

Trinethram News : మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రమాద బీమా, లోన్ బీమా పథకాలు ఆర్థిక రక్షణ కవచంలా నిలుస్తున్నాయని పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. మహిళల కుటుంబాలకు భరోసా కల్పించడం, వారి ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘం (ఎస్‌హెచ్‌జీ)లోని మహిళలు ఎవరైనా అనుకోని సందర్భంలో మరణిస్తే వారు తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడేవ‌ని మంత్రి గుర్తుచేశారు.

కుటుంబ సభ్యులు చెల్లించలేని పరిస్థితి ఉంటే ఇతర గ్రూపు సభ్యులే ఆ రుణభారం మోయాల్సి వచ్చేదని చెప్పారు. ఏదైనా కారణంతో సభ్యురాలు బ్యాంకు రుణం చెల్లించకపోతే ఆ భారం ఇతర సభ్యులపై పడుతూ, వారు కూడా చెల్లించలేని పక్షంలో బ్యాంకులు ఆయా సంఘాలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టేవని వివరించారు. దీని వల్ల కొత్త రుణాలు మంజూరు కాక చాలా సంఘాలు ఇనాక్టివ్‌గా మారాయ‌న్నారు.

ఈ అవస్థలకు చెక్ పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌హెచ్‌జీ మహిళలకు రుణ బీమాను వర్తింపజేయాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇందులో భాగంగా మహిళలకు జీవిత బీమాతో పాటు వారు పొందిన రుణాలపైనా బీమా వర్తింపజేసేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత బ్యాంకు రుణం తీసుకున్న మహిళ మరణిస్తే సంబంధిత రుణాన్ని ప్ర‌భుత్వ‌మే చెల్లించే విధంగా వ్యవస్థను అమలు చేస్తున్నామని వెల్లడించారు.
పది లక్షల బీమా :
ప్ర‌మాద బీమా పథకం కింద ప్రతి మహిళా సంఘం సభ్యురాలికి ప్రమాద మరణం సంభవించిన పక్షంలో రూ. 10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. బీమా ప‌థ‌కం అమ‌ల్లోకి వ‌చ్చిన 2024 నుంచి ఇప్పటివరకు 231 క్లెయిమ్స్ ను ప‌రిష్క‌రించి, మొత్తం రూ. 23.1 కోట్లు లబ్ధిదారుల కుటుంబాలకు అందించిన‌ట్టు మంత్రి చెప్పారు. అనుకోని ప్రమాదాల వల్ల కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోకుండా ఈ పథకం పెద్ద ఊరటనిస్తోందని ఆమె పేర్కొన్నారు.

అదేవిధంగా లోన్ బీమా పథకం ద్వారా మహిళా సంఘ సభ్యులు బ్యాంకుల వద్ద తీసుకున్న బకాయి రుణాలకు గరిష్టంగా రూ. 2 లక్షల వరకు బీమా కవరేజీ కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 2,993 క్లెయిమ్స్ ను ప్రాసెస్ చేసి మొత్తం రూ. 246 కోట్లను ప్ర‌భుత్వం చెల్లించింద‌ని వెల్లడించారు. లోన్ బీమా, ప్రమాద బీమా అమలులోకి వచ్చిన తర్వాత అనేక మహిళా సంఘాలు మళ్లీ క్రియాశీలకంగా మారినట్లు మంత్రి సీతక్క తెలిపారు. కొత్త సభ్యులు సంఘాలలో చేరుతున్నారని, బీమా భరోసాతో మహిళలు ధైర్యంగా వ్యాపారాలు విస్తరించుకుంటున్నారని చెప్పారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rs. 10 lakh accident insurance for every woman

You cannot copy content of this page

Scroll to Top