జూలై 23, 2026
TRINETHRAM NEWS
Protect Adivasi Rights

Protect Adivasi Rights : ఆంధ్రప్రదేశ్, అల్లూరి జిల్లా, అరకులోయ జూలై 22, (త్రినేత్రం న్యూస్): హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్లు 13, 2, 51లను తక్షణమే రద్దు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం లోతేరు పంచాయతీ కాగువలస గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరుతో రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ ప్రాంతాలకు కల్పించిన హక్కులు, 1/70 భూసంరక్షణ చట్టం, అటవీ హక్కుల చట్టం, పెసా చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రభుత్వం ఏకపక్షంగా జీవోలు జారీ చేసిందని ఆరోపించారు.
ఈ నెల 24న రంపచోడవరం పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన అక్రమ ఒప్పందాలు, జీవోలు 13, 2, 51ను రద్దు చేస్తూ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జీవో నంబర్ 13 ప్రకారం ప్రతిపాదించిన గుజ్జలి ప్రాజెక్టు అప్పర్ డ్యామ్ పరిధిలోని లోతేరు, ఇరగాయి, గుమ్మకోట, భీంపోలు, గరుగుబిల్లి పంచాయతీలతో పాటు మన్యం పార్వతీపురం జిల్లా పాచిపేంట మండలంలోని తంగలం, శతాభి, గర్సిగుడ్డి, మూటకుడు, గొత్తూరు పంచాయతీల పరిధిలో ఇటీవల డ్రోన్లు ఎగురుతున్నాయని తెలిపారు. డ్రోన్లు ఎగరవేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు గతంలో హామీ ఇచ్చినా, ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.
ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదని, చిత్తశుద్ధి ఉంటే హైడ్రో పవర్ ప్రాజెక్టు ప్రాంతంలో అనుమతి లేకుండా డ్రోన్లు ఎగురవేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పెసా నాయకులు కె. స్వామి, బలరాం, రామన్న, బి. నర్సింగరావు, డి. బాబురావు, కె. రమేష్, ఏ. గెన్ను, రాజు, రామచందర్, కె. త్రినాధ్, సుబ్బారావు, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page