75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతినుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు

TRINETHRAM NEWS

Trinethram News : పాశ్చాత్య విధానాలతో పోలిస్తే భారత ప్రజాస్వామ్యం ఎంతో పురాతనమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అందుకే భారత్‌ను ప్రజాస్వామ్యానికి తల్లిగా అభివర్ణించారు. ప్రస్తుతం దేశం అమృత కాల ప్రారంభ దశలో ఉందని.. భారత్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు పౌరులకు సువర్ణావకాశం ఉందన్నారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతినుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. కేవలం సంక్షేమ కార్యక్రమాలను విస్తరించడమే కాకుండా సంక్షేమం అనే ఆలోచనను పునర్నిర్వచించిందని అన్నారు. కొవిడ్‌ మహమ్మారి సమయంలో పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించిన ప్రభుత్వం.. అనంతరం కూడా కొనసాగిస్తోన్న విషయాన్ని గుర్తుచేశారు. జాతీయ విద్యా విధానం, ఆయుష్మాన్‌ భారత్‌, మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు పార్లమెంటు ఆమోదం, అంతరిక్ష ప్రయోగాల్లో సాధిస్తోన్న ప్రగతి తదితర అంశాలను ఉటంకించారు.
అయోధ్య రామమందిరంపై మాట్లాడుతూ.. సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియ, అత్యున్నత న్యాయస్థానం తీర్పు తర్వాతే ఆలయ నిర్మాణం ప్రారంభమైందన్నారు.

ఇదో గొప్ప మందిరంగా చరిత్రలో నిలిచిపోతుందని, ప్రజల విశ్వాసాలే కాకుండా న్యాయప్రక్రియపై పౌరులకు ఉన్న ఎనలేని నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో కొనసాగుతోన్న సంఘర్షణలను రాష్ట్రపతి ప్రస్తావించారు. వర్ధమాన మహావీరుడు, అశోకుడు, మహాత్మాగాంధీ బోధనలను ఉటంకించిన ముర్ము.. త్వరలోనే శాంతియుత వాతావరణం నెలకొల్పే పరిష్కార మార్గాలను అవి కనుగొంటాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.
కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి సాంకేతికల్లో వస్తోన్న పురోగతి దైనందిన జీవితంలో భాగమవుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇవి ఆందోళన కలిగించే అంశాలే అయినప్పటికీ.. యువతకు అద్భుతమైన అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు. కొన్నేళ్లుగా భారత్‌ వృద్ధి పథంలో దూసుకెళ్తోందని.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశంగా నిలుస్తోందన్నారు

You cannot copy content of this page

Scroll to Top