Trinethram News : ముంబయిలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురుస్తోన్న కుండపోత వానలకు ఆర్థిక రాజధాని నగరంలో జనజీవనం స్తంభించింది.
రోడ్లన్నీ జలమయం కావడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. 107 ఏళ్ల నాటి వర్షపాత రికార్డును బ్రేక్ చేసేలా కురిసిన ఈ వర్షం ప్రభావానికి మెట్రో సర్వీసులు, రైళ్లు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది.
ముంబయితో పాటు పొరుగున ఉన్న ఠానే, రాయ్‌గఢ్‌లకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముంబయిలోని లోతట్టు ప్రాంతాలైన కుర్లా, సియాన్, దాదర్, పరేల్ వంటి ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదనీరు రోడ్లపైనుంచి పెద్ద ఎత్తున పొంగి ప్రవహిస్తోంది.
కొన్ని రోజులుగా ముంబయి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని బృహాన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) విజ్ఞప్తి చేసింది.
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ముంబయిలోని ఆక్వా లైన్ 3లో కొత్తగా ప్రారంభించిన ఆచార్య ఆత్రే చౌక్ భూగర్భ మెట్రో స్టేషన్ నీట మునిగింది. రెండు వారాల క్రితమే ప్రారంభించిన ఈ భూగర్భ కారిడార్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆచార్య ఆత్రే చౌక్, వర్లి స్టేషన్ల మధ్య రైలు సర్వీసులను నిలిపివేశారు. ఆయా స్టేషన్లలోకి నీరు ప్రవహించడంతో పలువురు ప్రయాణికులు చిక్కుకుపోయారు. మెట్రో కోచ్‌ల్లోకి నీరు ప్రవేశించడం, ఎస్కలేటర్లు మూసివేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
‘ఆచార్య ఆత్రే చౌక్ స్టేషన్ వద్ద దృశ్యం జలపాతాన్ని తలపించింది. మెట్లపైనుంచి నీరు ఉప్పొంగుతోంది’ అని ఒక ప్రయాణికుడు సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టు పెట్టాడు. అలాగే, వర్లి స్టేషన్‌లో ప్లాట్‌ఫాం నుంచి నీరు కోచ్‌లలోకి ప్రవేశించినట్లు సమాచారం.
కింగ్స్ సర్కిల్, మంత్రాలయ, దాదర్ టీటీ ఈస్ట్, పరేల్ టీటీ, కలచౌకి, వాడాలా, హింద్ మాతా, కెంప్స్ కార్నర్, చర్చిగేట్, చించ్పోకలి, దాదర్ వంటి లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనాల రాకపోలు నిలిచిపోయాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


