
ఎన్టీఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 21; జిల్లా కేంద్రమైన విజయవాడ పార్లమెంటు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ, రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి తీసుకురావడం, వ్యవసాయ వ్యయాన్ని తగ్గించడం, ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ ఉప-మిషన్ (ఎస్ ఎం ఎ ఎం) పథకం అమలు పై విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) లోక్ సభలో ప్రశ్నించారు.
ఆయన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్‌నాథ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. మంత్రి సమాధానం ప్రకారం, రాష్ట్రాలు వ్యవసాయ యాంత్రీకరణ ఉప-మిషన్‌తో పాటు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖకు సంబంధించిన అన్ని పథకాలను కలుపుకొని ఏకీకృత వార్షిక కార్యాచరణ ప్రణాళికలను (ఏ ఏ పి)లు సమర్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే, వ్యక్తిగత యాజమాన్య ప్రాతిపదికన వ్యవసాయ యంత్రాలు, పరికరాల కొనుగోలుకు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాల లబ్ధిదారుల రాష్ట్రాల వారీ, సంవత్సరాల వారీ వివరాలు వెల్లడించారు.
పథకం అమలుపై సమగ్ర ప్రభావ మూల్యాంకనాన్ని నీతి ఆయోగ్ అభివృద్ధి పర్యవేక్షణ మరియు మూల్యాంకన కార్యాలయం (డి ఎం ఈ ఓ) ఆధ్వర్యంలో నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2025లో విడుదలైన అధ్యయన నివేదిక ప్రకారం, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు అద్దె యంత్రాల లభ్యతను పెంచడం ద్వారా ఎస్ ఎం ఎ ఎం పథకం ఎంతో ఉపయోగకరంగా మారిందని స్పష్టం చేసింది. వ్యవసాయ యాంత్రీకరణ వల్ల ఉత్పాదకత పెరగడంతో పాటు శ్రమ వ్యయం కూడా గణనీయంగా తగ్గుతోందని నివేదిక పేర్కొంది.
అలాగే, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సమాచారం ప్రకారం, దేశంలో వ్యవసాయ విద్యుత్ లభ్యత 1971-72లో హెక్టారుకు 0.372 కిలోవాట్ల నుంచి 2021-22 నాటికి హెక్టారుకు 3.045 కిలోవాట్లకు పెరగడం వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ వేగంగా విస్తరిస్తోందనడానికి నిదర్శనమని కేంద్ర ప్రభుత్వం వివరించింది
రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉండటం వల్ల వ్యవసాయ ఖర్చులు తగ్గడంతో పాటు దిగుబడులు పెరుగుతాయని అన్నారు. చిన్న, సన్నకారు రైతులు కూడా వ్యవసాయ యాంత్రీకరణ ప్రయోజనాలు పొందేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రైతులు ఈ పథకాన్ని మరింత విస్తృతంగా వినియోగించుకుని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe