త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజమహేంద్రవరం : ఒక పేద విద్యార్ధి ఉన్నత చదువు నిమిత్తం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) తమ భవానీ ఛారిటబుల్ ట్రస్టు తరపున రూ. 20 వేలు ఆర్ధిక సహాయం అందచేశారు. స్థానిక 44వ డివిజన్‌కు చెందిన ఐఐటీ చదువుతున్న సాకా విశాల్ సందేశ్ అనే పేద విద్యార్ధికి ఫీజు నిమిత్తం ఈ రోజు తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో సదరు నగదును అందచేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ ట్రస్టు తరపున నిత్యం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పేద విద్యార్ధులకు ఫీజులు కోసం, పేదలకు వైద్య ఖర్చులు కోసం ఆర్ధిక సహాయం చేయడం తాము ఆనవాయితీగా పెట్టుకున్నామన్నారు. కష్టం అంటూ వచ్చిన వారు నిరాశపడకుండా వారి సమస్య లేదా బాధ తీరేలా సహకారం అందిస్తున్నామన్నారు.
కాగా కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విద్య.. వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సిటీ నియోజకవర్గంలో ఇంత వరకు 149 మందికి రూ. కోటి 99 లక్షల వరకు సీఎం సహాయ నిధి ద్వారా అందచేశామని చెప్పారు. తన పుట్టిన రోజు సందర్భాని పురష్కరించుకుని మెగా జాబ్ మేళా నిర్వహించి ప్రతిభ కలిగిన విద్యార్ధులకు మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉపాధి కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. అమరావతి… భవానీ ఛారిటబుల్ ట్రస్టు (ఏబీసీటీ) ద్వారా స్కిల్ ఆన్ వీల్ వాహనాన్ని నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ నిరుపేద విద్యార్ధులకు కంప్యూటర్‌లో శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. యువత కోసం త్వరలోనే రాజమండ్రి ఎంటర్ ప్రెన్యూర్‌షిప్`2025 కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామన్నారు. అలాగే తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సంకల్పమన్నారు.
అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందచేస్తున్నామని చెప్పారు. గత ఐదేళ్ళ వైసీపీ పాలనలో రాజమండ్రిలో సీఎం సహాయ నిధి నుంచి ఒక్కచెక్కు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇంకా నగరంలో సీఎంఆర్‌ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్న వారు 77 మంది ఉన్నారని ఆ అందరికి రెండు నెలల్లోనే నిధులు మంజూరు అవుతాయని తెలిపారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని 15 రోజులకు ఒకసారి సందర్శించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జవ్వాది విజయలక్ష్మి, తెలుగుదేశం పార్టీ నాయకులు వంజరపు శంకర్, పాలవలస బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


