జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Minister Kinjarapu Atchannaidu

Minister Kinjarapu Atchannaidu : త్రినేత్రం న్యూస్ : అమరావతి, జూన్ 15: రాష్ట్రంలోని ఆక్వా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రొయ్యల ఫీడ్ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలను శాస్త్రీయంగా అంచనా వేయడం, పర్యవేక్షించడం, పారదర్శకమైన ఫీడ్ ధరల నిర్ణయానికి శాశ్వత రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ శ్రింప్ ఫీడ్ ఇన్‌గ్రిడియెంట్స్ ప్రైస్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి తెలిపారు. ఆక్వా రంగంలో ఫీడ్ ధరల నియంత్రణ, పారదర్శకత, నాణ్యత ప్రమాణాల పరిరక్షణ లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుందన్నారు.

ఈ కమిటీలో మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (MPEDA), సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్‌వాటర్ ఆక్వాకల్చర్ (CIBA), ఫిషరీస్ యూనివర్సిటీ, ఆక్వా ఫీడ్ తయారీదారుల ప్రతినిధులు, ఆక్వా రైతుల సంఘాల ప్రతినిధులు, ఏపీఎస్‌ఏడీఏ సభ్యులు, ఫీడ్ డీలర్ల సంఘాల ప్రతినిధులు, ఫిషరీస్ శాఖ సాంకేతిక నిపుణులు, ఆర్టీజీఎస్ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. అదేవిధంగా ముగ్గురు ఆక్వా రైతుల ప్రతినిధులు, ఇద్దరు ఏపీఎస్‌ఏడీఏ డైరెక్టర్లను మత్స్యశాఖ కమిషనర్ నామినేట్ చేయనున్నారని చెప్పారు. ప్రభుత్వ విధానపరమైన మార్గదర్శకత్వం, సమన్వయం మరింత సమర్థవంతంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కో-వైస్ చైర్మన్‌ను సభ్యునిగా చేర్చే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. కాకినాడ రాష్ట్ర మత్స్య సాంకేతిక విద్యా సంస్థ (SIFT) ప్రిన్సిపాల్ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారని వివరించారు.

రొయ్యల ఫీడ్ ధరలను ప్రభావితం చేసే ముడి పదార్థాల వ్యయం, తయారీ ఖర్చులు, రవాణా వ్యయాలు, మార్కెట్ పరిస్థితులు, నాణ్యత ప్రమాణాలు తదితర అంశాలను కమిటీ నిరంతరం సమీక్షిస్తుందని మంత్రి తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫిష్‌మీల్, సోయాబీన్ తదితర ఫీడ్ పదార్థాల ధరలు, దిగుమతి, ఎగుమతి పరిస్థితులను పర్యవేక్షిస్తూ రైతులకు సరైన సమాచారం అందించేలా చర్యలు తీసుకుంటుందన్నారు.

ఫీడ్ తయారీదారులు, ఆక్వా రైతులు, డీలర్లు, ఇతర భాగస్వాముల అభిప్రాయాలను సేకరించి, సాంకేతిక నిపుణులు, పరిశోధనా సంస్థల సహకారంతో పారదర్శకమైన ధరల నిర్ణయ విధానాలను రూపొందించడం ద్వారా ఆక్వా రైతులకు మేలు చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. డిజిటల్ యాప్ ఆధారంగా ఫీడ్ ధరల సమీక్ష, ఫీడ్ నాణ్యత ప్రమాణాల పరిరక్షణ, ఐఓటీ సాంకేతికత వినియోగం, ఫీడ్ పొదుపు చర్యలు, ప్రత్యామ్నాయ ఫీడ్ పదార్థాలపై పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ కమిటీ తోడ్పాటునందిస్తుందని తెలిపారు. ఆక్వా రైతుల ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం, ఫీడ్ ధరల విషయంలో పారదర్శకత తీసుకురావడం, ఆక్వా రంగాన్ని మరింత లాభదాయకంగా తీర్చిదిద్దడం కోసం ఈ శాశ్వత రాష్ట్రస్థాయి కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page