జూలై 11, 2026
TRINETHRAM NEWS
Minister Atchannaidu is angry

Minister Atchannaidu : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : మే 12 ; రాష్ట్రంలోని ఆక్వా రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా రొయ్యల ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రొయ్యల ఫీడ్ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరిగిన నేపథ్యంలో వనామీ ఫీడ్‌పై కిలోకు రూపాయలు ఎనిమిది, టైగర్ రొయ్యల ఫీడ్‌పై కిలోకు రూపాయలు పది పెంచినట్లు సమాచారం అందిందన్నారు.

ఇప్పటికే సాగు వ్యయాలు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులపై ఈ ధరల పెంపు మరింత భారం మోపే పరిస్థితి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర ఎస్ ఏ డి ఏ చట్టం ప్రకారం రైతు సంఘాలతో సంప్రదింపులు జరిపిన అనంతరమే ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఫీడ్ కంపెనీలు ఆ నిబంధనలను పాటించకుండా వ్యవహరించడం ఆందోళనకరమన్నారు.

ఈ విషయంపై ఫిషరీస్ కమిషనర్ ఇప్పటికే ఫీడ్ తయారీ సంస్థలకు రైతులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించినప్పటికీ, ధరల పెంపును అమలు చేయడం సమంజసం కాదన్నారు. రైతుల ఆందోళనలు, సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిగణిస్తోందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో పెంచిన ధరల అమలును తక్షణమే నిలిపివేయాలని సంబంధిత ఫీడ్ తయారీ సంస్థలకు ఫిషరీస్ కమిషనర్ ద్వారా నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.

అలాగే ఈ అంశంపై రైతు సంఘాలు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులతో నేడు (బుధవారం) ఉదయం సమావేశం నిర్వహించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని లక్షలాది ఆక్వా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు పక్షానే నిలుస్తుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని సంతోషాన్ని వ్యక్తపరిచారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page